AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

టోల్ ప్లాజాల వద్ద నగదుకు స్వస్తి.. రేప‌టి నుంచి కొత్త నిబంధన..!

దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు ఇది ఒక ముఖ్యమైన అప్‌డేట్. రేప‌టి (ఏప్రిల్ 1వ తేదీ) నుంచి టోల్ ప్లాజాల వద్ద నగదు చెల్లింపులను పూర్తిగా నిలిపివేయనున్నట్లు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) స్పష్టం చేసింది. ఇకపై టోల్ రుసుములను ఫాస్టాగ్ లేదా యూపీఐ వంటి డిజిటల్ పద్ధతుల్లో మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. ఈ మేరకు దేశంలోని అన్ని జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలపై కొత్త నిబంధన అమల్లోకి రానుంది.

 

రహదారుల వ్యవస్థను ఆధునికీకరించడంలో భాగంగా ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. టోల్ ప్లాజాల వద్ద వాహనాల రద్దీని తగ్గించి, ప్రయాణ సమయాన్ని ఆదా చేయాలనే లక్ష్యంతో నగదు రహిత విధానాన్ని అమలు చేస్తున్నారు. టోల్ వసూళ్లలో పారదర్శకతను పెంచడంతో పాటు వాహనాలు టోల్ గేట్ల వద్ద ఆగకుండా వేగంగా వెళ్లేందుకు ఇది దోహదపడుతుంది. దీనివల్ల ఇంధన వినియోగం తగ్గి, కాలుష్యం కూడా తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు.

 

అయితే, ఈ మార్పు వల్ల డిజిటల్ చెల్లింపులకు సిద్ధంగా లేని కొంతమంది ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. సరైన ఫాస్టాగ్ లేని లేదా అందులో తగినంత బ్యాలెన్స్ లేని వాహనాలకు జరిమానా విధించవచ్చు. కొన్ని సందర్భాల్లో అటువంటి వాహనాలను టోల్ ప్లాజా వద్ద నిలిపివేసే అవకాశం కూడా ఉంది. ప్రయాణికులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేశారు. ఒకవేళ ఫాస్టాగ్‌లో సమస్య ఉంటే, టోల్ బూత్‌ల వద్ద అందుబాటులో ఉండే క్యూఆర్ కోడ్‌లను స్కాన్ చేసి యూపీఐ ద్వారా తక్షణమే చెల్లింపులు చేయవచ్చు. అయితే, కొన్నిసార్లు నెట్‌వర్క్ సమస్యల కారణంగా ఈ లావాదేవీలు ఆలస్యం కావచ్చని అధికారులు హెచ్చరిస్తున్నారు.

 

అందువల్ల ప్రయాణికులు తమ ప్రయాణానికి ముందే ఫాస్టాగ్ గా యాక్టివ్‌గా ఉంచుకోవ‌డం, దానిలో తగినంత బ్యాలెన్స్ ఉంచుకోవ‌డం చేయాలని ఎన్‌హెచ్ఏఐ తెలిపింది. ఫాస్టాగ్‌ను తమ బ్యాంకు ఖాతాతో సరిగ్గా లింక్ చేసుకోవడం కూడా ముఖ్యం. ముందుజాగ్రత్తగా స్మార్ట్‌ఫోన్‌లో పనిచేసే యూపీఐ యాప్‌ను సిద్ధంగా ఉంచుకోవడం మంచిది. ఈ మార్పు భారతీయ రహదారుల వ్యవస్థను మరింత వేగవంతంగా, సమర్థవంతంగా మార్చడంలో ఒక కీలక ముందడుగుగా పరిగణిస్తున్నారు.

ANN TOP 10