AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

అఫ్గాన్ ఆస్పత్రిపై పాక్ వైమానిక దాడి: రషీద్ ఖాన్ భావోద్వేగం.. యుద్ధ నేరమంటూ ఆగ్రహం

పాకిస్థాన్ మరియు అఫ్గానిస్థాన్ సరిహద్దుల మధ్య ఉద్రిక్తతలు పరాకాష్టకు చేరాయి. అఫ్గానిస్థాన్‌లోని కాబుల్‌లో ఉన్న ఒక ఆస్పత్రిపై పాకిస్థాన్ సైన్యం అర్ధరాత్రి జరిపిన వైమానిక దాడులు పెను విధ్వంసానికి దారితీశాయి. ఈ దారుణ ఘటనలో సుమారు 400 మందికి పైగా అఫ్గాన్ పౌరులు ప్రాణాలు కోల్పోగా, మరో 250 మంది తీవ్రంగా గాయపడ్డారు. పవిత్ర రంజాన్ మాసంలో వైద్య సదుపాయాలు అందించే ఆస్పత్రులు, పౌరుల నివాసాలపై ఉద్దేశపూర్వకంగా దాడులు చేయడం అంతర్జాతీయ సమాజంలో తీవ్ర కలకలం రేపుతోంది.

ఈ ఘటనపై అఫ్గానిస్థాన్ స్టార్ క్రికెటర్లు రషీద్ ఖాన్, నవీన్ ఉల్ హక్, మహమ్మద్ నబీ తీవ్రంగా స్పందించారు. ముఖ్యంగా రషీద్ ఖాన్ సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేస్తూ.. పౌర నివాసాలు, విద్యా సంస్థలు, ఆస్పత్రులపై దాడులు చేయడం ముమ్మాటికీ ‘యుద్ధ నేరం’ (War Crime) అని అభివర్ణించారు. పవిత్రమైన రంజాన్ నెలలో ఇలాంటి అమానవీయ చర్యలకు ఒడిగట్టడం పాకిస్థాన్ పట్ల అసహ్యం కలిగిస్తోందని మండిపడ్డారు. ఈ ఘటనపై ఐక్యరాజ్యసమితి (UN) తక్షణమే స్పందించి విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.

మరో క్రికెటర్ నవీన్ ఉల్ హక్ మరింత ఘాటుగా స్పందిస్తూ.. పాకిస్థాన్ ప్రభుత్వానికి, ఇజ్రాయెల్ పాలనకు మధ్య తేడా ఏమీ లేదని విమర్శించారు. తన దేశ ప్రజలపై జరుగుతున్న ఈ అన్యాయాన్ని చూసి తట్టుకోలేకపోతున్నానని ఆవేదన చెందారు. గాయం కారణంగా జట్టుకు దూరంగా ఉన్న మహమ్మద్ నబీ సైతం ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. యుద్ధ మేఘాలు కమ్ముకున్న ఈ కష్టకాలంలో అఫ్గాన్ ప్రజలందరూ ఐక్యంగా ఉండాలని, ఒక జాతిగా తాము మళ్లీ పుంజుకుంటామని క్రికెటర్లు ధీమా వ్యక్తం చేశారు.

ANN TOP 10