పశ్చిమ ఆసియాలో ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య యుద్ధం తీవ్ర రూపం దాల్చింది. మంగళవారం జరిగిన ఒక భారీ వైమానిక దాడిలో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ఫోర్సెస్ (IRGC)కు చెందిన బసిజ్ యూనిట్ చీఫ్ ఘోలమ్రెజా సోలేమానీని హతమార్చినట్లు ఇజ్రాయెల్ రక్షణ దళాలు (IDF) అధికారికంగా ప్రకటించాయి. సోలేమానీ గత ఆరేళ్లుగా ఈ విభాగం కమాండర్‌గా ఉంటూ ఇరాన్‌లో పౌర నిరసనకారులపై బలప్రయోగం మరియు తీవ్ర ధమనకాండకు నాయకత్వం వహించినట్లు ఇజ్రాయెల్ పేర్కొంది.
ఈ దాడిలో సోలేమానీతో పాటు ఇరాన్ భద్రతా వ్యవహారాల చీఫ్ అలీ లారిజానీ కూడా మరణించినట్లు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కోట్స్ ధ్రువీకరించారు. లారిజానీ ఇరాన్ అధికార యంత్రాంగంలో అత్యంత శక్తివంతమైన వ్యక్తిగా గుర్తింపు పొందారు. ఇజ్రాయెల్ మనుగడకు ముప్పు తలపెట్టే శక్తులను ఎక్కడున్నా వదిలిపెట్టబోమని ఈ సందర్భంగా ఇజ్రాయెల్ సైన్యం హెచ్చరించింది. అయితే, తమ అగ్రశ్రేణి అధికారుల మృతిపై ఇరాన్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.
గత 17 రోజులుగా ఇరాన్, అమెరికా మరియు ఇజ్రాయెల్ మధ్య భీకర పోరాటం కొనసాగుతోంది. ఫిబ్రవరి 28న ప్రారంభమైన ఈ ఘర్షణల నేపథ్యంలో ఇరాన్ ఇప్పటికే హుర్ముజ్ జలసంధిని దిగ్బంధించి, గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై దాడులు చేస్తోంది. తాజా పరిణామాలతో మధ్యప్రాచ్యంలో యుద్ధం మరింత ముదిరే అవకాశం ఉందని అంతర్జాతీయ విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.








