ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని దివ్యాంగులకు ఉగాది పండుగ ముందే తీపి కబురు అందించింది. ఇప్పటికే మహిళలకు అమలు చేస్తున్న ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని దివ్యాంగులకు కూడా వర్తింపజేస్తూ ‘దివ్యాంగ శక్తి’ పేరుతో కొత్త పథకాన్ని తీసుకువచ్చింది. ఈ పథకాన్ని రేపు మంగళగిరిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరియు మంత్రి నారా లోకేష్‌లతో కలిసి అధికారికంగా ప్రారంభించనున్నారు.
ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 11.16 లక్షల మంది దివ్యాంగులకు లబ్ది చేకూరనుంది. 40 శాతం కంటే ఎక్కువ వైకల్యం కలిగిన వారు ఈ ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని పొందేందుకు అర్హులు. అంతేకాకుండా, దివ్యాంగులకు సహాయకులుగా (Attendants) వచ్చేవారికి కూడా బస్సు టికెట్ ధరలో 50 శాతం రాయితీ కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం అమలు కోసం ఏపీ ప్రభుత్వం ఏటా రూ.207 కోట్ల అదనపు భారాన్ని భరించనుంది.
రేపు మంగళగిరిలో ప్రారంభోత్సవం అనంతరం ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి దివ్యాంగులతో కలిసి బస్సులో ప్రయాణించి, వారితో కలిసి ఆత్మీయ విందులో పాల్గొంటారు. అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి దివ్యాంగులతో కలిసి ప్రయాణిస్తారు. ఇప్పటికే ‘స్త్రీ శక్తి’ పథకం ద్వారా కోట్లాది మంది మహిళలు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని పొందుతుండగా, ఇప్పుడు దివ్యాంగులకు కూడా ఈ అవకాశం కల్పించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.








