ఆంధ్రప్రదేశ్‌లోని పట్టణ ప్రాంతాల్లో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం ఉగాదికి ముందే భారీ ఊరటనిచ్చింది. పెండింగ్‌లో ఉన్న ఆస్తిపన్ను బకాయిలపై పేరుకుపోయిన వడ్డీ భారాన్ని తగ్గించేలా మున్సిపల్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగియనుండటంతో, బకాయిల వసూళ్లను వేగవంతం చేసే ఉద్దేశంతో ఈ వెసులుబాటు కల్పించారు.
ప్రభుత్వం ప్రకటించిన ఈ ప్రత్యేక పథకం ప్రకారం, ఎవరైతే తమ పాత ఆస్తిపన్ను బకాయిలను ఈ నెల (మార్చి) 31వ తేదీ లోపు ఒకేసారి చెల్లిస్తారో, వారికి వడ్డీలో 50 శాతం రాయితీ లభిస్తుంది. ఈ మేరకు మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్ కుమార్ అధికారికంగా జీవో జారీ చేశారు. ఇప్పటికే ట్యాక్స్ చెల్లించిన వారికి కూడా తదుపరి చెల్లింపుల్లో మినహాయింపు వర్తిస్తుందని అధికారులు స్పష్టం చేశారు.
హైదరాబాద్‌లోని జీహెచ్‌ఎంసీ తరహాలోనే ఏపీ ప్రభుత్వం కూడా రాయితీలు ప్రకటించడంపై ప్రజల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. ఆర్థిక ఇబ్బందుల వల్ల పన్నులు చెల్లించలేక, పెరుగుతున్న వడ్డీతో సతమతమవుతున్న సామాన్యులకు ఇది ఒక మంచి అవకాశమని చెప్పవచ్చు. బకాయిలు ఉన్న వారందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకుని మార్చి 31లోపు తమ చెల్లింపులు పూర్తి చేయాలని ప్రభుత్వం కోరింది.








