తమది పూర్తిస్థాయిలో ‘పీపుల్ ఫ్రెండ్లీ ప్రభుత్వం’ అని, ప్రజా సమస్యల పరిష్కారమే పరమావధిగా పనిచేస్తామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శనివారం ఆయన అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అత్యంత మారుమూల ప్రాంతమైన నందిగరువు గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా గిరిజనులతో ‘మాట-మంతి’ నిర్వహించిన పవన్, గతంలో గిరిజన ప్రాంతాల అభివృద్ధికి నిధుల మళ్లింపు జరిగిందని ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే ఏజెన్సీ ప్రాంతాల్లో 460 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం చేపట్టామని వివరించారు.
గిరిజన ప్రాంతాల్లో గర్భిణీలు పడుతున్న డోలీ కష్టాలను రూపుమాపడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పవన్ పేర్కొన్నారు. కేవలం 40 గడపలు ఉన్న గ్రామానికి కూడా రెండు కోట్ల రూపాయలతో రోడ్డు నిర్మించడం తమ చిత్తశుద్ధికి నిదర్శనమని చెప్పారు. మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న ప్రాంతాలకు రావడానికి నాయకులు భయపడతారేమో కానీ, ప్రజల కోసం పనిచేసే తనకు ఎటువంటి భయం లేదని ఆయన వ్యాఖ్యానించారు. కూటమి అభ్యర్థులు గెలవని చోట్ల కూడా ఎక్కడా వివక్ష చూపకుండా అభివృద్ధి పనులు చేస్తామని భరోసా ఇచ్చారు.
ఈ పర్యటనలో భాగంగా గిరిజనులు ప్రస్తావించిన పలు సమస్యలపై పవన్ కల్యాణ్ తక్షణమే స్పందించారు. ఓనూరు పాఠశాల మరమ్మతులు, కొత్తపొలం గ్రామానికి కొత్త రోడ్డు మంజూరుతో పాటు అసంపూర్తిగా ఉన్న అంగన్‌వాడీ భవనాలను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొని గిరిజనుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆర్భాటాలకు పోకుండా లక్షలాది మంది మధ్య కాకుండా, 70 ఏళ్లుగా సరైన సౌకర్యాలు లేని గ్రామంలో ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం తనకు సంతృప్తిని ఇచ్చిందని పవన్ కల్యాణ్ ఉద్ఘాటించారు.








