తెలంగాణ రాష్ట్రంలో గృహ అవసరాలకు వినియోగించే వంటగ్యాస్ కొరత ఏమీ లేదని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. గ్యాస్ సిలిండర్ల ధరలు పెరుగుతాయనే ప్రచారంతో లేదా కొరత ఏర్పడుతుందనే ఆందోళనతో వినియోగదారులు ముందస్తుగా బుకింగ్‌లు చేసుకుంటున్నారని, దీనివల్ల సాధారణం కంటే రెట్టింపు స్థాయిలో బుకింగ్‌లు నమోదవుతున్నాయని ఆయన వివరించారు. రాష్ట్రంలో కేవలం వాణిజ్య (కమర్షియల్) సిలిండర్లకు మాత్రమే కొంత ఇబ్బంది ఉందని, గృహ వినియోగదారులకు మాత్రం ఎటువంటి ఇబ్బంది లేదని ఆయన భరోసా ఇచ్చారు.
రాష్ట్రంలోని ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్లతో నిర్వహించిన కీలక సమావేశంలో మంత్రి ప్రస్తుత పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చించారు. తెలంగాణలో మొత్తం 810 మంది డిస్ట్రిబ్యూటర్లు ఉండగా, సుమారు 1.3 కోట్ల మంది గ్యాస్ వినియోగదారులు ఉన్నారని ఆయన వెల్లడించారు. వీరిలో దీపం పథకం కింద 28 లక్షల మంది లబ్ధి పొందుతున్నారని తెలిపారు. సాధారణంగా రాష్ట్రవ్యాప్తంగా గృహ వినియోగదారులు నెలకు 60 లక్షల సిలిండర్లను వినియోగిస్తారని, ప్రస్తుత డిమాండ్‌కు అనుగుణంగా సరఫరాను పర్యవేక్షిస్తున్నామని చెప్పారు.
ప్రజలు అనవసర ఆందోళనతో గ్యాస్ సిలిండర్లను స్టాక్ చేసుకోవద్దని మంత్రి విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న ఎల్పీజీ నౌకల వల్ల సరఫరా మరింత మెరుగుపడుతుందని, సిలిండర్ల బ్లాక్ మార్కెటింగ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించామని పేర్కొన్నారు. నిరంతరాయంగా గ్యాస్ అందేలా డిస్ట్రిబ్యూటర్లు సమన్వయంతో పనిచేయాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు.








