తెలంగాణలో వాహన రిజిస్ట్రేషన్ల సమయంలో బ్యాంక్ అకౌంట్ నంబర్, ఐఎఫ్‌ఎస్‌సీ (IFSC) కోడ్ అడుగుతుండటంతో వాహనదారుల్లో కొత్త ఆందోళన మొదలైంది. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానా నేరుగా బ్యాంక్ ఖాతా నుంచే కట్ అవుతుందనే ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో చేసిన ‘ఆటోమేటిక్ ఫైన్ కలెక్షన్’ వ్యాఖ్యల నేపథ్యంలో, షోరూమ్‌ల వద్ద బ్యాంక్ వివరాలు తప్పనిసరి చేయడంతో ఈ అనుమానాలు బలపడ్డాయి. దీనిపై ప్రభుత్వం మరియు రవాణా శాఖ అధికారులు స్పష్టతనిచ్చారు.
అధికారిక వర్గాల సమాచారం ప్రకారం, బ్యాంక్ అకౌంట్ వివరాలను సేకరిస్తోంది చలాన్లు కట్ చేయడానికి కాదని, కేవలం ఖచ్చితమైన చిరునామా ధృవీకరణ (Address Proof) కోసమేనని స్పష్టం చేశారు. చాలామంది వాహనదారులు ఇళ్లు మారినప్పుడు తమ ఆర్సీ (RC) కార్డులో చిరునామాను అప్‌డేట్ చేయడం లేదని, దీనివల్ల ప్రమాదాలు జరిగినప్పుడు లేదా నోటీసులు పంపాల్సి వచ్చినప్పుడు యజమానులను గుర్తించడం కష్టమవుతోందని అధికారులు చెబుతున్నారు. బ్యాంక్ ఖాతాలో కస్టమర్లు తమ అడ్రస్‌ను క్రమం తప్పకుండా అప్‌డేట్ చేస్తారు కాబట్టి, దానిని ప్రామాణికంగా తీసుకోవాలని రవాణా శాఖ భావిస్తోంది.
ప్రస్తుతానికి చలాన్ల నగదును బ్యాంక్ అకౌంట్ నుంచి ఆటోమేటిక్‌గా డెబిట్ చేసే ప్రక్రియ ప్రారంభం కాలేదు. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ సాఫ్ట్‌వేర్‌లో బ్యాంక్ వివరాలు ఇస్తేనే పత్రాలు అప్‌లోడ్ అయ్యేలా మార్పులు చేయడంతో షోరూమ్‌ల వద్ద బ్యాంక్ పాస్ బుక్ కాపీలను అడుగుతున్నారు. కాబట్టి, వాహనదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇది కేవలం రికార్డుల నిర్వహణలో పారదర్శకత కోసమేనని ప్రభుత్వం పేర్కొంది. అయితే భవిష్యత్తులో డిజిటల్ విధానాలను మరింత పటిష్టం చేసే దిశగా అడుగులు పడుతున్నట్లు తెలుస్తోంది.









