వాయువ్య ఇరాన్‌లో రిక్టర్ స్కేల్‌పై 5.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా.. 440 మంది గాయపడ్డారు. ఈ భూకంపం ధాటికి చాలా భవనాలు నేలమట్టమయ్యాయి. శిథిలాల కింద చాలా మంది చిక్కుకుపోయారు. ఈ భూకంపం ఇరాన్-టర్కీ సరిహద్దు సమీపంలోని ఖోయ్ నగరంలో చోటుచేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఘటనాస్థలికి చేరుకున్న విపత్తు నిర్వహణ బృందాలు సహాయక చర్యలను ముమ్మరం చేశాయి. క్షతగాత్రులను అధికారులు హాస్పిటల్స్ కు తరలించారు. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) ప్రకారం, భూకంపం 23:44:44 (UTC+05:30)కి సంభవించింది.
ఇది ఖోయ్‌కి 10 కి.మీ నైరుతి దిశలో 14 కి.మీ. లోతులో ఈ భూకంపం చోటుచేసుకుంది. అదే విధంగా ఇవాళ ఇరాన్ సెంట్రల్ సిటీ ఇస్ఫహాన్‌లోని మిలిటరీ ప్లాంట్‌లో కూడా భారీ పేలుడు సంభవించింది. ఇది డ్రోన్ దాడిగా స్థానిక మీడియా పేర్కొంది. గతంలో.. 2022 జూలైలో దక్షిణ ఇరాన్‌లో 6.3 తీవ్రతతో భూకంపం సంభవించింది.ఈ ఘటనలో 44 మంది గాయపడ్డారు. ఇరాన్ చరిత్రలో అతి పెద్ద భూకంపం 2003లో చోటుచేసుకుంది. 6.6 తీవ్రతతో ఏర్పడిన ఈ భూకంపం బామ్ నగరాన్ని తుడిచిపెట్టేసింది. ఇందులో 26వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 2017లో పశ్చిమ ఇరాన్‌లో 7 తీవ్రతతో సంభవించిన భూకంపం ధాటికి 600 మందికి పైగా మరణించగా..9,000 మందికి పైగా గాయపడ్డారు.