మాజీ మంత్రి పేర్ని నాని సహా పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై మచిలీపట్నం పోలీసులు కేసులు నమోదు చేశారు. అనుమతి లేకుండా నిరసన కార్యక్రమం చేపట్టారన్న ఆరోపణలపై ఈ చర్యలు తీసుకున్నారు. దాదాపు 40 మంది వైసీపీ నాయకులు, కార్యకర్తలపై కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.
వైసీపీ శ్రేణులు నిన్న ‘చలో మెడికల్ కాలేజ్’ పేరుతో నిరసనకు పిలుపునిచ్చాయి. ఈ కార్యక్రమానికి ఎలాంటి అనుమతులు లేవని, ఆంక్షలు విధించామని పోలీసులు వెల్లడించారు. అయినప్పటికీ, మాజీ మంత్రి పేర్ని నాని, కీలక నేతలు దేవినేని అవినాష్, ఉప్పాల రాము, పేర్ని కిట్టుతో పాటు ఇతర నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
పోలీసుల ఆదేశాలను పట్టించుకోకుండా, భారీగా జనసమీకరణ చేసి మెడికల్ కాలేజ్ వద్ద ఆందోళనకు ప్రయత్నించారని మచిలీపట్నం పోలీసులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించినందుకు వారిపై కేసులు నమోదు చేసినట్లు వివరించారు.