ఏపీ ఫైబర్ నెట్ ఛైర్మన్ జీవీ రెడ్డి కామెంట్స్ రాష్ట్రంలో సంచలనంగా మారాయి. ఫైబర్నెట్ ఎండీ దినేశ్కుమార్పై ఆయన చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపాయి. వివాదానికి చెక్ పెట్టడానికి రంగంలోకి దిగిన మంత్రి జనార్దనరెడ్డి, ఎండీ దినేష్, ఛైర్మన్ జీవీ రెడ్డికి నివేదికలు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. ఛైర్మన్ జీవీ రెడ్డి ఆరోపణల్లో ఎంత వాస్తవం ఉందనేదానిపై మంత్రి ఆరా తీసే ప్రయత్నం చేశారు. మొదట ఫైబర్ నెట్ ఎండీ దినేశ్, కార్యదర్శి యువరాజ్ భేటీ అయ్యారు.
ఛైర్మన్ చేసిన ఆరోపణలపై ముగ్గురి మధ్య సుదీర్ఘచర్చ జరిగింది. ఛైర్మన్ ఆరోపణలపై పూర్తి వివరాలతో 2 రోజుల్లో నివేదిక ఇస్తామని వారు చెప్పారు. జీవీ రెడ్డి నవంబరులోనే ఛైర్మన్గా బాధ్యతలు తీసుకున్నారని గుర్తు చేసిన ఎండీ దినేష్.. అప్పుడే అన్నింటిపైనా ఆయనకు అవగాహన ఎలా వస్తుంది ప్రశ్నించారు. ఛైర్మన్ ఆరోపణలలో నిజం లేదని సమాధానం చెప్పారు. ఎండీ వెర్షన్ విన్న మంత్రి 2 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఆయనతో పాటు.. జీవీ రెడ్డికి కూడా కీలక ఆదేశాలు పాస్ చేశారు. ఆయన చేసిన ఆరోపణలకు ఆధారాలతో నివేదిక ఇవ్వాలని చెప్పారు.
రెండు రోజుల క్రితం ఫైబర్ నెట్ ఎండీ, ఈడీ, అధికారులపై ఛైర్మన్ జీవీ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫైబర్ నెట్ అధికారుల్లో లెక్కలేనితనం, బద్ధకం కనిపిస్తున్నాయని జీవీ రెడ్డి ఆరోపించారు. కోర్టు వాయిదాలకు అధికారులు వెళ్లకపోవడం వలనే 337 కోట్ల జరిమానా కట్టాల్సి వచ్చిందని ఆన్నారాయన. తనకు అకౌంట్స్ బుక్స్ ఇవ్వడం లేదని, అధికారులు ఎవరిని కాపాడాలనుకుంటున్నారో అర్థం కావడం లేదని సంచలన ఆరోపణలు చేశారు. బిజినెస్ చేయకపోగా ఉన్నదాన్ని పోగొడుతున్నారని జీవీ రెడ్డి ప్రధాన ఆరోపణ. గత ప్రభుత్వ పెద్దలతో చేతులు కలిపి తొలగించిన ఉద్యోగుల కూడా జీతాలు చెల్లించారని విమర్శించారు.
400 మంది ఉద్యోగులను తొలగించాలని ఆదేశించినా పట్టించుకున్న నాదులే లేడని ఆవేదన వ్యక్తం చేశారు. తానిచ్చిన ఆదేశాలపై ఎండీ, ఈడీ సంతకాలు చేయలేదని అన్నారు. ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు అవుతున్నా.. రాష్ట్రంలో ఒక్క కొత్త కనెక్షన్ కూడా ఇవ్వలేదని చెప్పారు. దీంతో సంస్థ ఆదాయం పడిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు జీవీ రెడ్డి. గత ప్రభుత్వ పెద్దలతో ఎండీ, ఈడీ చేతులు కలిపారని చైర్మన్ ప్రధాన ఆరోపణ. అందుకే వారిని బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. జీవీ రెడ్డి చేసిన ఆరోపణలు ఇప్పుడు ఏపీని కుదిపేస్తున్నాయి. ఈ వివాదానికి చెక్ పెట్టడానికి మంత్రి జనార్థర్ రెడ్డి రంగంలోకి దిగారు. నివేదికలు ఇవ్వాలని ఇద్దరినీ ఆదేశించారు.