AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కోల్ కతా డాక్టర్ రేప్, మర్డర్ కేసులో సీబీఐ కోర్టు షాకింగ్ తీర్పు..

దేశవ్యాప్తంగా ఆ కేసు ఓ సంచలనం. సదరు నిందితుడికి కఠినశిక్ష విధించాల్సిందేనంటూ నిరసనల పర్వం కూడా సాగింది. జూనియర్ డాక్టర్ ను రేప్ చేసి హత్యకు పాల్పడ్డ నిందితులకు సరైన శిక్ష విధించాల్సిందేనని పలు ప్రజాసంఘాలు కూడా రోడ్డెక్కాయి. ఈ తరుణంలో కోల్ కతా న్యాయస్థానం సంచలన తీర్పునిచ్చింది. సోమవారం వాదనలు విన్న న్యాయమూర్తి నిందితుడికి జీవిత ఖైదు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు.

 

కోల్ కతా లోని ఆర్జికర్ హాస్పిటల్ అండ్ మెడికల్ కళాశాలలో ఓ జూనియర్ వైద్యురాలిపై గత ఏడాది ఆగస్టు 9వ తేదీన హత్యాచార ఘటన జరిగింది. అయితే ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారగా, పోలీసులు కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకొని దర్యాప్తు వేగవంతంగా సాగించారు. అదే వైద్యశాలలో వాలంటీర్ గా పనిచేస్తున్న సంజయ్ రాయ్ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు తేల్చారు. ముమ్మర దర్యాప్తు అనంతరం నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి న్యాయస్థానం ముందు హాజరుపరిచారు.

 

కేసు విచారణ సాగుతున్న సమయంలోనే ఎట్టి పరిస్థితుల్లో నిందితుడికి కఠిన శిక్ష విధించాలంటూ ప్రజా సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. దేశవ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు తమ భద్రతకు సంబంధించి నిరసనలు తెలపడంతోపాటు, ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలంటూ డిమాండ్ చేశారు. ఈ తరుణంలో చివరకు కేసుకు సంబంధించి న్యాయస్థానం తీర్పునిచ్చే సమయం రానే వచ్చింది. సోమవారం న్యాయమూర్తి ఇరుపక్షాల వాదనను విన్న అనంతరం నిందితుడికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చారు. అలాగే 50,000 జరిమానాను సైతం న్యాయస్థానం విధించింది. అంతేకాకుండా మరణించే వరకు జైల్లోనే ఉండాలని న్యాయమూర్తి తీర్పునిచ్చారు. బాధిత కుటుంబానికి రూ.17 లక్షల పరిహారం ఇవ్వాలని ప్రభుత్వానికి కోర్టు ఆదేశించింది. ఈ తీర్పుపై నిందితుడికి సరైన శిక్ష విధించారంటూ ప్రజా సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10