నువ్వు బాయిలర్ కోడి.. మేము నాటు కోడి..
రాజకీయం నేర్చుకోవాలంటే రేవంత్ వద్దకు వెళ్చొచ్చు
కేటీఆర్‌పై జగ్గారెడ్డి ఫైర్
(మహా, హైదరాబాద్):
మాజీ మంత్రి కేటీఆర్‌ను బాయిలర్ కోడితో పోల్చారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. ‘ కేటీఆర్ బాయిలర్ కోడి.. మేము నాటు కోటి. కేటీఆర్‌ను కేసీఆర్ నాజూగ్గా పెంచారు’ అంటూ సెటైర్ వేశారు. అంతేకాకుండా కేటీఆర్ రాజకీయం నేర్చుకోవాలంటే రేవంత్ వద్దకు వెళ్లొచ్చు అంటూ కౌంటర్ ఇచ్చారు. మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి విరుచుకుపడ్డారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. మాజీ మంత్రి కేటీఆర్ చిన్న పిల్లల్లా మాట్లాడుతున్నారని… కేటీఆర్‌కు రాజకీయ పరిజ్ఞానం ఉందా అని ప్రశ్నించారు. సీఎం ఏం చేసినా దాన్ని చెడుగా కేటీఆర్, హరీశ్‌రావు వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు. బీఆర్‌ఎస్ సోషల్ మీడియా ద్వారా కన్ఫ్యూజ్ క్రియేట్ చేస్తున్నారన్నారు.
‘‘కేటీఆర్ బాయిలర్ కోడి. మేము నాటు కోడి. కేటీఆర్‌ను కేసీఆర్ నాజూగ్గా పెంచారు. అయ్య పేరుతో రేవంత్ రెడ్డి సీఎం కాలేదు. ఢక్కాముక్కీలు తిని రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. కేటీఆర్ రాజకీయం నేర్చుకోవాలంటే రేవంత్ రెడ్డి దగ్గరకి పోయి క్లాస్‌లు తీసుకోవాలి’’ అంటూ హితవుపలికారు. దామగుండం 360 మీటర్ల ఎత్తు ఉండి.. అక్కడ నుంచి సిగ్నల్స్ పంపడానికి ఎటువంటి ఇబ్బందులు లేకపోవడంతో పాటు అనేక సానుకూలతలు ఉండటంతో అక్కడ రాడార్ ఏర్పాటు చేశారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఎత్తు ఉంది కాబట్టి మనం సేఫ్ అన్నారు.
దండుపాళ్యం గ్యాంగ్‌లా..
బీఆర్‌ఎస్ దండుపాళ్యం గ్యాంగ్‌లా తయారయ్యిందని విరుచుకుపడ్డారు. కేటీఆర్ నంబర్ వన్ బేవకూఫ్ అంటూ విమర్శించారు. ఈ దేశంలో రాష్ట్రపతి ఢిల్లీ తరువాత వచ్చి నివసించేది హైదరాబాద్ అన్నారు. దేశ రక్షణ కోసం కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సీఎం ఇంప్లిమెంట్ చేశారన్నారు. దామగుండంలో రాడార్‌కు జీవో ఇచ్చిందే బీఆర్‌ఎస్ ప్రభుత్వం అని జగ్గారెడ్డి పేర్కొన్నారు.









