AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బీఆర్‌ఎస్‌ వికెట్‌ నం. 9.. కాంగ్రెస్‌ గూటికి మరో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే

కేసీఆర్‌కు బిగ్‌ షాక్‌
సీఎం సమక్షంలో చేరిన శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ

(అమ్మన్యూస్, హైదరాబాద్‌):
బీఆర్‌ఎస్‌ పార్టీకి మరో బిగ్‌ షాక్‌ తగిలింది. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కాంగ్రెస్‌లో చేరారు. శనివారం సీఎం రేవంత్‌ సమక్షంలో ఆయన కాంగ్రెస్‌ పార్టీ కండువా కప్పుకున్నారు. దీంతో కాంగ్రెస్‌ పార్టీలో చేరిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల సంఖ్య 9కి చేరింది. కాగా, ఇటీవల రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే ప్రకాశ్‌ గౌడ్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన విషయం తెలిసిందే.

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు కాంగ్రెస్‌లోకి క్యూ కట్టారు. ఇప్పటికే 8మంది బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ పార్టీ తీర్థం పుచ్చుకోగా.. తాజాగా, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ కాంగ్రెస్‌లో చేరడంతో ఆ సంఖ్య 9కి చేరింది. ఇప్పటికే రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే ప్రకాశ్‌ గౌడ్, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ కాంగ్రెస్‌లో చేరారు.

కార్పొరేటర్లు సైతం..
అరికపూడి గాంధీతోపాటు పలువురు కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. మియాపూర్‌ కార్పొరేటర్‌ ఉప్పలపాటి శ్రీకాంత్, చందానగర్‌ కార్పొరేటర్‌ మంజుల, శేరిలింగంపల్లి కార్పొరేటర్‌ రాగం నాగేందర్‌ యాదవ్‌ కాంగ్రెస్‌ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

బీఆర్‌ఎస్‌ పార్టీ అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంట్‌ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోవడంతో ఒక్కొక్కరు కాంగ్రెస్‌లోకి వెళ్తున్నారు. ఇక బీఆర్‌ఎస్‌ పార్టీకి భవిష్యత్‌ లేదని, అందుకే కాంగ్రెస్‌లో చేరడమే బెటర్‌ అని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా ఒక్కొక్కరుగా ఎమ్మెల్యేలు చేజారిపోతున్న నేపథ్యంలో మరికొంతమంది ఎమ్మెల్యేలు పార్టీని వీడకుండా బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత కేసీఆర్‌ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో ఉత్కంఠగా మారింది.

మరో ఐదుగురు ఎమ్మెల్యేలు సిద్ధం..
అరికెపూడి గాంధీ కాంగ్రెస్‌లో చేరడంతో మరో ఐదుగురు ఎమ్మెల్యేలు హస్తం గూటికి రానున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఈ ఐదుగురు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలతో కాంగ్రెస్‌ నేతలు జరిపిన చర్చలు ఫలించాయని తెలుస్తోంది. మిగతా వారంతా కాంగ్రెస్‌లో చేరేందుకు ఎదురుచూస్తున్నారు. మరోవైపు ఈనెల 24 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు జరగనున్నాయి. ఈ తేదీలోగా చేరికలు పూర్తి చేయాలని కాంగ్రెస్‌ అధిష్టానం భావిస్తోంది.

ANN TOP 10