AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కాంగ్రెస్‌లోకి మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే.. నేడే ముహూర్తం

మరో బీఆర్ఎస్ వికెట్ పడింది. అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని చవిచూసిన కారు పార్టీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. అధికార పార్టీలోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇది వరకే ఏడుగురు ఎమ్మెల్యేలు హస్తం గూటికి చేరారు. తాజాగా మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కూడా ఇదే బాటలో వెళ్లుతున్నారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ రేపు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో ఆయన సమక్షంలోనే కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్‌తోపాటు మున్సిపల్ కౌన్సిల్ చైర్మన్లు, ఇతర నాయకులు కూడా కాంగ్రెస్‌లో చేరుతున్నారు. ఇది వరకే ప్రకాశ్ గౌడ్ గతంలో సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలుసుకోవడం చర్చనీయాంశమైంది. అభివృద్ధి కార్యక్రమాల కోసమే మర్యాదపూర్వకంగా సీఎంను కలిసినట్టు ప్రకాశ్ గౌడ్ గతంలో వివరణ ఇచ్చారు.

తమ నియోజకవర్గ అభివృద్ధిని కాంక్షించే అధికార పార్టీలో చేరుతున్నామని వలసలు వస్తున్న ఎమ్మెల్యేలు చెబుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ గతంలో ప్రలోభ పెట్టి, కొందరిని బలవంతంగా పార్టీలోకి తీసుకుందని కాంగ్రెస్ నాయకులు గుర్తు చేస్తున్నారు. కానీ, తాము ఏ ఎమ్మెల్యేలనూ ప్రలోభపెట్టడం లేదని, వారే పార్టీలోకి వస్తామని ముందుకు వస్తున్నారని, తాము స్వాగతిస్తున్నామని చెబుతున్నారు.

ఇది వరకే బీఆర్ఎస్ నుంచి కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, సంజయ్ కుమార్, కాలె యాదవయ్య, బండ్ల కృష్ణ మోహన్ రెడ్డిలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాజాగా నేడు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో రాజేంద్రనగర్‌కు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ కూడా కాంగ్రెస్‌లో చేరుతున్నారు.

ANN TOP 10