AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బస్సులో పురుడుపోసిన మహిళా కండ‌క్ట‌ర్‌కు సన్మానం.. ఆ చిన్నారికి జీవితకాలపు ఉచిత బస్ పాస్‌ ప్ర‌క‌ట‌న‌

ఆర్టీసీ బస్సులో గర్భిణికి పురుడుపోసి మానవత్వం చాటుకున్న సంస్థ సిబ్బందిని టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం అభినందించింది. హైదరాబాద్ బస్ భవన్‌లో శనివారం ఉన్నతాధికారులతో కలిసి సంస్థ ఎండీ వీసీ సజ్జనర్ వారిని ఘనంగా సన్మానించారు.

బస్సులో జన్మించిన చిన్నారికి తమ బస్సుల్లో జీవిత కాలం ఉచితంగా ప్రయాణించేలా బస్ పాస్‌ను అందిస్తున్నట్లు ప్రకటించారు. ఆర్టీసీ బస్సులు, బస్ స్టేషన్‌ల‌లో పుట్టిన పిల్లలకు జీవిత కాలపు ఉచిత బస్ పాస్‌ను ఇవ్వాలని గతంలో యాజమాన్యం తీసుకున్న నిర్ణయం మేరకు.. ఈ ఆడబిడ్డ‌కు బర్త్ డే గిఫ్ట్‌గా లైఫ్ టైం ఫ్రీ బస్ పాస్‌ను మంజూరు చేస్తున్నట్లు వెల్ల‌డించారు.

హైదరాబాద్‌లోని ముషీరాబాద్ డిపోకు చెందిన 1 జెడ్ రూట్ బస్సులో శుక్రవారం ఉదయం శ్వేతా రత్నం అనే గర్భిణీ ఆరాంఘర్‌లో ఎక్కారు. బహదూర్‌పూర వద్దకు రాగానే ఆమెకు పురిటి నొప్పులు తీవ్రమయ్యాయి. ఈ విషయాన్ని గమనించిన కండక్టర్ ఆర్.సరోజ అప్రమత్తమై మహిళా ప్రయాణికుల సాయంతో సాధారణ ప్రసవం చేశారు. ఆమె పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చారు. డెలివరీ అనంతరం అనంతరం మెరుగైన వైద్యం కోసం బ‌స్సులోనే సమీపంలోని గవర్నమెంట్ మెటర్నటీ ఆస్పత్రికి తరలించారు. తల్లీబిడ్డా క్షేమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.

సమయస్పూర్తితో స్పందించి.. సకాలంలో కాన్పు చేసిన కండక్టర్ సరోజ సేవ‌ల‌ను ఈ సందర్భంగా టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ ప్రశంసించారు. ఏ మాత్రం ఆల‌స్యం చేయ‌కుండా త‌ల్లీబిడ్డ‌ను బ‌స్సులోనే మెట‌ర్న‌టీ ఆస్ప‌త్రికి తీసుకెళ్లిన డ్రైవ‌ర్‌ను కూడా అభినందించారు. కండ‌క్ట‌ర్‌ చాకచక్యంగా వ్యవహరించడంతోనే తల్లీబిడ్డా క్షేమంగా ఉన్నారని అన్నారు.

ANN TOP 10