AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

వడ్డీ రేట్లు యథాతథం.. ఆర్‌బీఐ కీల‌క ప్ర‌క‌ట‌న‌!

మానిట‌రీ పాలసీ కమిటీ మీటింగ్ ముగింపు నేపథ్యంలో వడ్డీ రేట్లపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ కీల‌క‌ ప్రకటన చేశారు. కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతున్నట్టు వెల్లడించారు. మానిట‌రీ పాలసీ కమిటీ మీటింగ్ లో ఆరుగురు సభ్యులు ఉంటారు. ఈసారి కూడా వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచాలని ఆరుగురులో నలుగురు ఓటు వేశారని ఆర్బీఐ గవర్నర్ స్పష్టం చేశారు. ఫలితంగా వరుసగా 8వసారి రెపో రేటును 6.5 శాతంగా ఉంచింది ఆర్బీఐ. 2023 ఏప్రిల్ నుంచి రెపో రేటును ఆర్‌బీఐ యథాతథంగా కొనసాగిస్తూ వస్తోంది.

అసలెంటీ రెపో రేటు..
రిజ‌ర్వ్ బ్యాంక్‌ దేశంలోని బ్యాంక్లకు డబ్బులను అప్పుగా ఇస్తుంది. ఆ అప్పుపై వడ్డీని వసూలు చేస్తుంది. దానినే రెపో రేట్ అంటారు. రెపో రేట్ పెరిగితే.. అధిక వడ్డీ చెల్లించాల్సి వస్తుంది కాబట్టి బ్యాంక్లకు కష్టమవుతుంది. అందుకే బ్యాంక్లు కూడా వివిధ లోన్లపై వడ్డీని పెంచుతాయి. ఇది కస్టమర్లను ప్రభావితం చేస్తుంది. రెపో రేటు తగ్గితే.. ఆర్బీఐకి బ్యాంక్లు ఇచ్చే వడ్డీ కూడా తగ్గుతుంది. త‌ద్వారా ప్రజలకు బ్యాంకులు ఇచ్చే రుణాలపై వడ్డీ రేట్లు దిగొస్తాయి. ఇక రెపో రెట్లు మారకపోవడంతో ప్రస్తుతం దేశంలో ఉన్న వివిధ లోన్లపై వడ్డీ రేట్లు కూడా పెద్దగా మారే అవకాశం లేదు.

ఆర్‌బీఐ మానటరీ పాలసీ నిర్ణయాలివే..
ద్రవ్యోల్బణం, వృద్ధి మధ్య మంచి సమతుల్యత కొనసాగుతోందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. ద్రవ్యోల్బణాన్ని 4 శాతం వద్ద ఉంచడానికి ఆర్‌బీఐ కట్టుబడి ఉందని పేర్కొన్నారు. అయితే ఆహార ద్రవ్యోల్బణం పెరుగుతుండడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
నైరుతి రుతుపవనాలు ఖరీఫ్ సీజన్లో పంటల ఉత్పత్తిని పెంచుతాయని ఆశిస్తున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్ ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే దీని వల్ల రిజర్వాయర్లలో నీటి నిల్వలు పెరుగుతాయని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.
రిటైల్ ద్రవ్యోల్బణం 2024-25 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 4.9 శాతం, రెండో త్రైమాసికంలో 3.8 శాతం, మూడో త్రైమాసికంలో 4.6 శాతం, నాల్గో త్రైమాసికంలో 4.5 శాతం ఉండొచ్చని ఆర్బీఐ అంచనా వేసింది.
అనుకున్నట్లుగా సకాలంలో మంచి వర్షాలు పడితే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం 4.5 శాతం ఉండవచ్చు. ఒకవేళ ఇలా జరగకపోతే ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉందని ఆర్‌బీఐ గవర్నర్ పేర్కొన్నారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రిటైల్ ద్రవ్యోల్బణంలో కొంత మేరకు దిద్దుబాటు జరగవచ్చని శక్తికాంత దాస్ అన్నారు.

ANN TOP 10