గౌహతి: డ్రగ్స్ అక్రమ రవాణాపై పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. రెండు స్పెషల్ ఆపరేషన్లలో ఆరుగురిని అరెస్ట్ చేశారు. 150 సబ్బు పెట్టెల్లో ఉంచి రవాణా చేస్తున్న రూ.9.5 కోట్ల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. అస్సాంలోని కాచర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. విశ్వసనీయ నిఘా ఆధారంగా మాదక ద్రవ్యాల రవాణాకు వ్యతిరేకంగా శనివారం రెండు స్పెషల్ ఆపరేషన్లు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. రామ్ ప్రసాద్‌పూర్, ధోలాయ్, బన్స్‌కండి, లఖిపూర్‌లలో వాహనాలను తనిఖీ చేసినట్లు చెప్పారు. 150 సబ్బు పెట్టెల్లో రవాణా చేస్తున్న 1.9 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ డ్రగ్స్ విలువ మార్కెట్‌లో రూ.9.5 కోట్లు ఉంటుందని వివరించారు.
కాగా, అక్రమంగా డ్రగ్స్ రవాణా చేస్తున్న ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. డ్రగ్స్ తరలిస్తున్న స్కూటీ, ఒక కారును స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. మణిపూర్‌లోని చురచంద్‌పూర్ నుంచి మాదక ద్రవ్యాలను అక్రమంగా రవాణా చేస్తున్నట్లు గుర్తించామని అన్నారు. దీనిపై మరింతగా దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.









