బ్యాలెట్ల ఓట్లపై పలు అనుమానాలు ఉన్నాయని, కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలుస్తామని ఏఐసీసీ చీఫ్ మల్లిఖార్జున ఖర్గే అన్నారు. శనివారం ఢిల్లీలోని ఖర్గే నివాసంలో ఇండియా కూటమి సమావేశం జరిగింది. గంటపాటు జరిగిన సమావేశానికి కూటమిలో ఉన్న పార్టీ అధినేతలు, నాయకులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నారు. శనివారంతో దేశవ్యాప్తంగా జరిగిన ఏడు దశల పోలింగ్ ముగిస్తుంది. దీంతో ఓటింగ్ సరళిపై.. అలాగే కౌంటింగ్ రోజున తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఇండియా కూటమి నేతల భేటీలో మల్లిఖార్జున ఖర్గే, సోనియా గాంధీ, కేసీ వేణుగోపాల్, ప్రియాంక గాంధీ కేజ్రీవాల్, భగవంత్ మాన్, డి రాజా, శరద్ పవార్, ఫరూక్ అబ్దుల్లా, అఖిలేష్ యాదవ్, తేజస్వి యాదవ్, చంపై సోరెన్ వంటి నేతలు హాజరయ్యారు. పలు కారణాల వల్ల పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తమిళనాడు సీఎం స్టాలిన్ ఈ సమావేశానికి దూరంగా ఉన్నారు. ఈ సందర్భంగా ఖర్గే మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో ఇండియా కూటమికి 295కు పైగా సీట్లకు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఇది తమ సర్వే కాదని, ప్రజలు ఇచ్చిన సర్వే అని చెప్పారు. కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామని ఖర్గే విశ్వాసం వ్యక్తం చేశారు.









