తల్లిదండ్రులు చెప్పినట్టు పిల్లలు వినడం.. వారు చెప్పినట్టు నడుచుకోవడం ఇది ఒకప్పటి మాట.. కాలంతో పాటు పిల్లలు ఆలోచనల్లో మార్పులు వచ్చాయి. వారికి నచ్చినట్టు తల్లిదండ్రులు ఉండటమే ప్రస్తుతం ట్రెండ్. వారి ఇష్టాలకు కాదంటే కొన్నిసార్లు అనర్ధాలకు దారితీస్తుంది. అందుకు ఈ ఘటనే ఉదాహరణ. తనకు ఇష్టంలేని కటింగ్ చేయించారని తొమ్మిదేళ్ల బాలుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషాదకర ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలోని గంగారం మండలం చింతగూడెం గ్రామంలో గురువారం చోటుచేసుకుంది.
గంగారం మండలం చింతగూడెం గ్రామానికి చెందిన ఈసం హర్షవర్ధన్ (9) అనే బాలుడు ఆరో తరగతి చదువుతున్నాడు. గూడూరు మండలం సీతానగరం హాస్టల్‌లో చదువుతున్న ఆ చిన్నారి.. వేసవి సెలవులు కావడంతో ఇంటి దగ్గర ఉన్నాడు. ఈ క్రమంలో నాలుగు రోజుల కిందట హర్షవర్దన్‌ను తండ్రి కాంతారావు సెలూన్ షాప్‌కి తీసుకెళ్లాడు. అక్కడ బాలుడు తనకు ఇష్టమైన కటింగ్ చేయించిమని కోరాడు. అయితే, ఆ బాలుడు చెప్పినట్టు కాకుండా వేరే విధంగా కటింగ్ చేయించడంతో మారాం చేశాడు. తండ్రి దగ్గర ఏడ్చి గోల చేయడంతో ఆయన మందలించాడు. దీంతో ఇంటి వెనక్కి వెళ్లి పురుగుల మందు సేవించాడు.
హర్షవర్ధన్ వాంతులు చేసుకోవడంతో అనుమానించిన తల్లిదండ్రులు చికిత్స కోసం మహబూబ్‌బాద్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. గురువారం సాయంత్రం చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. తనకు ఇష్టం లేని హెయిర్ కటింగ్ చేయించారని క్షణికావేశంలో బాలుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తీవ్ర విషాదం నింపింది.