ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్, ఎస్పీ పార్టీలు అధికారంలోకి వస్తే, రామమందిరంపైకి బుల్డోజర్లు తోలుతారని ప్రధాని మోడీ శుక్రవారం వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలను ఖర్గే తప్పుబట్టారు. ఇప్పటి వరకు తాము బుల్డోజర్లు వాడలేదని, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న వారిపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని కోరారు. శనివారం నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్, శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే ఇతర నాయకులతో కలిసి ముంబైలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఖర్గే మాట్లాడుతూ.. ప్రధానమంత్రియే ప్రజల్ని రెచ్చగొడుతున్నారని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, రాజ్యాంగం ప్రకారం అన్నింటినీ రక్షిస్తామని, రాజ్యాంగాన్ని ఫాలో అవుతామని ఆయన అన్నారు. మోడీ ఎక్కడికి వెళ్లినా, విభజన సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని, సమాజాన్ని విభజించాలనుకోవడం సరికాదన్నారు.
4న దేశంలో అచ్చే దిన్ రాబోతుంది: ఉద్ధవ్ థాక్రే
కాంగ్రెస్ మేనిఫెస్టోను ముస్లిం లీగ్ మేనిఫెస్టోగా అభివర్ణించిన మోడీ, ఇప్పుడు అది మావోయిస్టు మేనిఫెస్టో అని అంటున్నారని మండిపడ్డారు. మేనిఫెస్టోలో ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తామని నొక్కి చెప్పారు. జీఎస్టీ స్థానంలో సరళమైన, ఒకే రేటు జీఎస్టీని అమలు చేస్తామని చెప్పారు. అనంతరం ఉద్ధవ్ థాక్రే మాట్లాడుతూ.. జూన్ 4వ తేదీ నుంచి దేశంలో అచ్చే దిన్ రాబోతుందని తెలిపారు. ఉద్యోగాల వంటి సమస్యల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు బీజేపీ ఇండియా కూటమి ర్యాలీలో పాకిస్థాన్ జెండాలు అంటూ ప్రచారం చేస్తోందని ఉద్ధవ్ థాక్రే ఆరోపించారు.
200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇస్తాం: తేజస్వీ యాదవ్
తాము గత 17 నెలల్లో చేసిన అభివృద్ధి.. గత 17 ఏళ్లలో ఎవరూ చేయలేదని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ అన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల గురించి కేంద్రాన్ని ప్రశ్నిస్తే, వాళ్లు ఎటువంటి సమాధానం ఇవ్వడంలేదన్నారు. అన్ని సంస్థలను ప్రైవేటుపరం చేశారన్నారు. బీహార్‌లో విద్యుత్తు చాలా ఖరీదైందని, తాము అధికారంలోకి వస్తే 200 యూనిట్ల ఉచిత కరెంటును అందిస్తామన్నారు. 10 కేజీల బియ్యం కూడా ఉచితంగా అందిస్తామని తేజస్వి యాదవ్ చెప్పారు.