డీజీపీకి రఘునందన్ రావు ఫిర్యాదు
(అమ్మన్యూస్, హైదరాబాద్):
మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డిపై కేసు నమోదు చేయాలని శనివారం డీజీపీకి బీజేపీ మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మీడియాతో ఆయన మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్ కేసులో వెంకట్రామిరెడ్డి పాత్ర ఉందని ఇప్పటికే మాజీ డీసీపీ రాధాకిషన్ రావు స్టేట్మెంట్ ఇచ్చారని తెలిపారు.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో వెంకట్రామిరెడ్డికి సంబంధించిన 3 కోట్ల రూపాయలను తరలించినట్లు రాధాకిషన్ స్టేట్మెంట్లో చెప్పారని అన్నారు. వెంకట్రామిరెడ్డిపై ఇప్పటి వరకు పోలీసులు ఎలాంటి చర్యలూ తీసుకోలేదని చెప్పారు. వెంకట్రామిరెడ్డిని ఎందుకు కాపాడుతున్నారని నిలదీశారు. ఈ విషయం చెప్పాలని డీజీపీని కోరానని అన్నారు.
ఈ విషయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వ్యతిరేకంగా సాక్ష్యాలు ఉన్నప్పటికీ అరెస్ట్ చెయ్యడం లేదని అన్నారు. వెంటనే వెంకట్రామిరెడ్డిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఎఆర్ నంబర్ 243/2024 కేసులో అరెస్టయిన పోలీస్ అధికారి రాధాకిషన్ రావు మార్చ్ 9న ఇచ్చిన వాంగ్మూలంలోని పేజీ నెంబర్ 5, 6, 7లో అతను తాను బీఆర్ఎస్ నేత, రిటైర్డ్ ఐఏఎస్ వెంకట్రామిరెడ్డికి సన్నిహితుడని పేర్కొన్న విషయాన్ని రఘునందన్‌రావు వివరించారు.
వెంకట్రామిరెడ్డి, రాజ పుష్పా కన్స్ట్రక్షన్స్ యజమానులైనా ఆయన సోదరులు వ్యాపారుల నుంచి వసూలు చేసిన డబ్బులను ఎస్ఐ ద్వారా ప్రభుత్వ వాహనాల్లో తరలించినట్లు అందులో తెలిపారన్నారు. రాధాకిషన్ రావు చెప్పిన ప్రకారమే తాను ఆ డబ్బును తరలించినట్లు ఎస్ఐ సాయి కిరణ్ 161(3) కింద స్టేట్మెంట్ ఇచ్చిన విషయాన్ని రఘునందన్ రావు తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఇలా వెంకట్రామిరెడ్డి అనేక చట్ట వ్యతిరేక వ్యవహారాలు చేసారని, అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ వారి కుటుంబ సభ్యులతో సన్నిహితంగా ఉంటూ తనను ఏ చట్టం ఏమి చేయదనే తీరుతో నాన్ బెయిలబుల్ కేసులలో తప్పించుకున్నాడని రఘునందర్రావు డీజీపీకి ఇచ్చిన ఫిర్యాదులో స్పష్టం చేశారు. ఇప్పటికైనా చర్యలు చేపట్టాలని విన్నవించారు.