(అమ్మన్యూస్, హైదరాబాద్):
మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు. మల్కాజ్‌గిరి లోక్ సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ విజయం సాధించబోతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మల్లారెడ్డి బీఆర్‌ఎస్ పార్టీలో ఉన్నారు. వరుసగా రెండుసార్లు అదే పార్టీ నుంచి గెలిచారు. ఇటీవల బీఆర్‌ఎస్ ఓటమి తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే ప్రచారం జరిగినప్పటికీ దానిని ఆయన కొట్టి పారేశారు. కానీ తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు మరోసారి సంచలనంగా మారాయి.
శుక్రవారం హైదరాబాద్‌లోని కండ్లకోయ కేఎస్‌ఎఆర్ ఫంక్షన్ హాలులో ఓ వివాహ వేడుకలో మల్లారెడ్డి, బీజేపీ మల్కాజ్‌గిరి అభ్యర్థి ఈటల రాజేందర్ ఎదురుపడ్డారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ… ‘అన్నా.. మల్కాజ్‌గిరి నుంచి నువ్వే గెలుస్తున్నావ్’ అంటూ ఈటలను కౌగిలించుకున్నారు. ఇక్కడి నుంచి ఈటల గెలవబోతున్నారని జోస్యం చెప్పారు. మా అన్నతో (ఈటల) ఫొటో తీయండి అంటూ అక్కడున్న వారిని కోరారు. దీంతో అక్కడున్న వారు వారిద్దరినీ ఫొటో తీశారు. వారిద్దరు కాసేపు సరదాగా మాట్లాడుకున్నారు.









