AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ములుగు సరిహద్దుల్లో ఎన్‌కౌంటర్‌.. ముగ్గురు మావోయిస్టులు మృతి

ములుగు: తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లో మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో (Encounter) ముగ్గురు మావోయిస్టులు మృతిచెందారు. ములుగు జిల్లా కర్రిగుట్టలు-ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్‌ పరిధిలో ఉన్న అటవీ ప్రాంతంలో పోలీసులు కూంబింగ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులకు మావోయిస్టులు తారసపడ్డారు. తప్పించుకునే క్రమంలో భద్రతా బలగాలపై మావోయిస్టులు కాల్పులు జరిపారు. ప్రతిగా పోలీసులు జరిపిన ఫైరింగ్‌లో ముగ్గురు మావోయిస్టులు మరణించారని అధికారులు తెలిపారు. ఘటనా స్థలంలో ఏకే-47తోపాటు మూడు తుపాకులు, పేలుడు పదార్థాలు లభించాయని చెప్పారు. ఈ ఎన్‌కౌంటర్‌కు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

కాగా, గత సోమవారం ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 13 మంది మావోయిస్టులు మృతిచెందిన విషయం తెలిసిందే. బీజాపూర్ జిల్లా గంగులూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని కోర్చోలి-లేంద్ర అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారనే సమాచారంతో బీజాపూర్ డీఆర్‌జీ, సీఆర్‌పీఎఫ్‌, ఎస్టీఎఫ్‌, కోబ్బ్రా బృందాలు కూంబింగ్ చేపట్టగా ఎందురుకాల్పులు జరిగాయి. పోలీస్ బృందాలకు మావోయిస్టులకు మధ్య సుమారు ఎనిమిది గంటల పాటు ఎన్‌కౌంటర్‌ జరిగినట్లు సమాచారం. కాల్పుల అనంతరం ముగ్గురు మహిళలతో సహా 13 మంది మావోయిస్టుల మృతదేహాలు పోలీసులకు లభించాయి. సంఘటన స్థలం నుంచి భారీ మొత్తంలో మందుగుండు సామగ్రి, ఒక ఏకే 47, ఎల్‌ఎంజీ ఆయుధం, 303 బోర్ రైఫిల్, 12 బోర్ రైఫిల్స్, రాకెట్ లాంచర్లు, భారీ పరిమాణంలో బీజీఎల్ షెల్స్, విప్లవ సాహిత్యం, నిత్యావసర సరుకులు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ANN TOP 10