ఇందిరమ్మ రాజ్యం పేరిట అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇంటి ఆడబిడ్డలకు తీరని అన్యాయం చేస్తున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు. ఉద్యోగావకాశాల్లో మహిళల హక్కలను హరించేలా రోస్టర్ పాయింట్లు లేని హారిజాంటల్ రిజర్వేషన్లు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం దారుణమని మండిపడ్డారు. తెలంగాణలో ఆడబిడ్డలకే కాకుండా వికలాంగుల ఉద్యోగాలకు భద్రత లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. నియామకాల్లో ఆడబిడ్డలకు అన్యాయం జరిగే జీవో 3ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
జీవో 3ను వెనక్కి తీసుకునేలా సీఎం రేవంత్ రెడ్డిని ఆదేశించాలంటూ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు సోమవారం నాడు ఎమ్మెల్సీ కవిత లేఖలు రాశారు. ఈ సందర్భంగా తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ కవిత మాట్లాడారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు మహిళలకు రోస్టర్ పాయింట్లతో కూడిన హారిజాంటల్ రిజర్వేషన్లు అమలవుతున్నాయని, మహిళలకు హారిజాంటల్ రిజర్వేషన్ ఇస్తూనే వర్టికల్ రిజర్వేషన్లతో సమానంగా అమలు చేయాలంటే రోస్టర్ పాయింట్లను పెట్టాలనే ప్రతిపాదన 1996లో తెరమీదికి వచ్చిందని పేర్కొన్నారు. దాంతో జవో 41, 56లను ప్రభుత్వం జారీ చేసిందని గుర్తు చేశారు.