సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేల బృందం మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించింది. హైదరాబాద్ నుంచి మంగళవారం బస్సుల్లో వచ్చిన సీఎం బృందానికి అధికారులు స్వాగతం పలికారు. అనంతరం అక్కడ బ్యారేజీలో కుంగిన పిల్లర్లు, బ్యారేజీ వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. సీఎం, మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు సీపీఐ, ఎంఐఎం ఎమ్మెల్యేలు మేడిగడ్డకు చేరుకున్నవారిలో ఉన్నారు. మరికాసేపట్లో అధికారులు మేడిగడ్డ బ్యారేజీ పరిస్థితిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.
బ్యారేజీ వద్ద కుంగిన పిల్లర్లను సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావుతో పాటు ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ఎంఐఎం నేతలు ప్రాజెక్టు దెబ్బతిన్న ప్రాంతాన్ని పరిశీలించారు. బీఆర్ఎస్, బీజేపీ నేతలు ఈ పర్యటనకు దూరంగా ఉన్నారు. ప్రాజెక్టు పరిశీలన సందర్భంగా ప్రజా ప్రతినిధుల బృందం ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. వంతెనను పూర్తిగా పరిశీలించిన అనంతరం దీనిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ను అధికారులు ఇవ్వనున్నారు. మంగళవారం ఉదయం అసెంబ్లీ స్వల్ప కాలిక చర్చ అనంతరం సీఎం సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల, అధికారుల బృందం మేడిగడ్డకు ప్రత్యేక బస్సుల్లో వచ్చారు.









