AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

హైదరాబాద్‌ను కోల్పోయాం.. సీఎం జగన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఐదు ప్రజా బడ్జెట్లు ప్రవేశ పెట్టినట్లు ముఖ్యమంత్రి జగన్ చెప్పారు. అసెంబ్లీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గత ఐదేళ్లలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నామని, కోవిడ్ కారణంగా ఆదాయం తగ్గి ఖర్చులు ఎక్కువ పెరిగాయని అన్నారు. పన్నుల కారణంగా కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తగ్గాయాని ఆయన వెల్లడించారు. కోవిడ్ కారణంగా మూడేళ్లలో దాదాపు 66 వేల కోట్ల ఆదాయం కోల్పోయామన్నారు. అలాగే అన్ని దేశాలకు ఆదాయాలు తగ్గి.. ఖర్చులు బాగా పెరగడం సహజమై పోయిందన్నారు. మనతో పాటు ప్రపంచంలోని అన్ని దేశాలకు అప్పులు పెరిగాయన్నారు. అయినా కూడా 2024 లో పూర్తి స్థాయి బడ్జెట్ తామే ప్రవేశపెట్టినట్లు తెలిపారు. 13. 29 శాతం రాష్ట్రంలో పన్ను ఆదాయం పెరుగుతూ వస్తుందన్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఇప్పటికీ రెవెన్యూ లోటు ఎదుర్కొంటున్నామని పేర్కొన్నారు. చంద్రబాబు హయంలో రాష్ట్రానికి కేంద్రం అందించిన పన్నుల వాటా 35 శాతం అయితే.. వైసీపీ హయాంలో మాత్రం 31 శాతం అందిస్తుందన్నారు. రాష్ట్రానికి అత్యంత కీలకమైన వ్యవసాయం, విద్య, మహిళా సాధికారత గత ప్రభుత్వం విధానాల వల్ల ఎంతో ప్రభావం పడిందన్నారు. ఇలాంటి కష్టాలు కూడా ఎదుర్కోని ఐదేళ్ల పాలన సాగించామని చెప్పారు.

2015-19 మధ్య కేంద్రం ఇచ్చిన పన్నుల వాటా కేవలం 31.5 శాతం మాత్రమే అన్నారు. గత ప్రభుత్వ విధానాల వల్ల కూడా బాగా నష్టం జరిగిందని, ఆర్థిక వ్యవస్థ కుదేలు అయ్యిందని విమర్శించారు. రైతులను చంద్రబాబు మోసం చేశారని, ఐదేళ్లలో చంద్రబాబు రైతులకు రూ.15వేల కోట్లు కూడా ఇవ్వలేదని ఆరోపించారు. పొదుపు సంఘాల వడ్డీ కూడా మాఫీ చేయలేదన్నారు. ప్రతీ రాష్ట్రానికి ఒక ఎకనామిక్‌ పవర్‌ హౌజ్‌ ఉండాలని అభిప్రాయపడ్డారు. అలాంటి పవర్‌హౌజ్‌ లేకపోతే రాష్ట్ర ఆదాయాలు ఎప్పటికీ పెరగవని చెప్పుకొచ్చారు. ఉమ్మడి ఆస్తిగా నిర్మించుకున్న హైదరాబాద్‌ను కోల్పోయామని, రాష్ట్ర విభజన తర్వాత ఇప్పటికీ రెవెన్యూ లోటు వెంటాడుతోందని కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర తలసరి ఆదాయం తగ్గిపోయిందని, అందుకే విశాఖ గురించి పదే పదే చెబుతున్నామని స్పష్టం చేశారు. రాష్ట్రం ఆర్థికంగా ఎదగడానికి పెద్ద పెద్ద నగరాలు అవసరమని, ఓ హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై లాంటి నగరాలు ఉండాలన్నారు. నమ్మినవాడు మునుగుతాడు.. నమ్మించిన వాడు దోచుకోగలుగుతాడని, చంద్రబాబుది కూడా ఇదే సిద్ధాంతాన్ని ఫాలో అవుతారని విరుచుకుపడ్డారు. ఎన్నికల ముందు చంద్రబాబు మేనిఫెస్టో పేరుతో పెద్ద బుక్‌ తెస్తారని ఎద్దేవా చేశారు. ఎన్నికలయ్యాక మేనిఫెస్టో చెత్తబుట్టలోకి వెళ్తుందని, ఏ గ్రామానికి వెళ్లినా చంద్రబాబు చేసిందేమీ లేదని, ఆయన పాలన అధ్వాన్నంగా సాగిందని ముఖ్యమంత్రి జగన్ మండిపడ్డారు.

ANN TOP 10