హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు మంగళవారం ఉదయం తెలంగాణ భవన్‌కు రానున్నారు. కాలి తుంటి శస్త్ర చికిత్స తర్వాత తొలిసారిగా ఆయన తెలంగాణ భవన్‌కు వస్తున్నారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు కృష్ణా పరివాహక ప్రాంతంలో వున్న ఉమ్మడి జిల్లాల నేతలు, పార్టీ ముఖ్య నాయకులతో విస్తృత స్థాయి భేటీ జరగనుంది. ఈ సమావేశానికి కేసీఆర్ హాజరై అధ్యక్షత వహించనున్నారు.
ఉమ్మడి మహబూబ్ నగర్, ఖమ్మం, నల్గొండ, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలకు ఆహ్వానం పంపారు. కృష్ణా బేసిన్‌లో వున్న ఉమ్మడి ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడంపై పోరుబాటకు సంబంధించి కార్యాచరణపై నేతలకు కేసీఆర్ దిశా నిర్దేశం చేయనున్నారు. అలాగే ఈ నెల 13న ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రాజెక్టుల అప్పగింతకు వ్యతిరేకంగా రైతు గర్జన పేరిట నిరసన సభ నిర్వహిస్తారు. అసెంబ్లీ సమావేశాలు, కేబినెట్‌లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై కేసీఆర్ చర్చించనున్నారు.









