ప్రభుత్వ లాంఛనాలతో ఏర్పాట్లు
మాజీ మంత్రి విజయ రామారావు అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సీఎస్ నుంచి కలెక్టర్‌కు ఆదేశాలు వెళ్లాయి. కుటుంబసభ్యులను సంప్రదించి అంత్యక్రియలకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని హైదరాబాద్ కలెక్టర్‌కు సూచించారు. దీంతో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ రోజు విజయరామారావు అంత్యక్రియలు జరగనున్నాయి.
అంతిమయాత్రకు ట్రాఫిక్ క్లియర్ చేయడంతో పాటు బందోబస్తు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. మీడియా కవరేజ్‌కు కూడా చర్యలు తీసుకోవాలని సూచించింది. బ్రెయిన్ స్ట్రోక్‌తో జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి విజయ రామారావు కన్నుమూశారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు కేబినెట్లో మంత్రిగా ఆయన పనిచేశారు.
హైదరాబాద్ కమిషనర్, సీబీఐ డైరెక్టర్‌గా పనిచేసిన ఆయన.. ఆ తర్వాత పదవీవిరమణ తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 1999 ఎన్నికల్లో టీడీపీ తరపున ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి జనార్థన్ రెడ్డిపై గెలుపొందారు. రోడ్లు, భవనాలశాఖ మంత్రిగా చంద్రబాబు ఆయనకు అవకాశం కల్పించారు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా విజయ రామారావుకు పేరుంది. అయితే 2004 ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి విజయ రామారావు ఓడిపోయారు. ఆ తర్వాత రాష్ట్ర విభజన తర్వాత టీడీపీకి గుడ్ బై చెప్పి టీఆర్ఎస్లో చేరారు. కొద్దిరోజులు టీఆర్ఎస్లో కొనసాగిన అనంతరం క్రియాశీల రాజకీయాలకు దూరమయ్యారు.