తెలంగాణ ముఖ్యమంత్రిగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారానికి సంబంధించిన అధికారిక ప్రక్రియలు శరవేగంగా జరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ తరుపున గెలిచిన 64 మంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని సీఎల్పీ నేతగా ఎన్నుకున్నట్టు తెలియజేసేందుకు కాంగ్రెస్ సీనియర్ నేతలు సిద్ధమయ్యారు. ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను గవర్నర్ తమిళిసైకి అందజేసేందుకు కాసేపట్లో కాంగ్రెస్ బృందం బయలుదేరనుంది. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి, తదితరులు వెళ్లనున్నారు.
కాగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారానికి సంబంధించిన ఏర్పాట్లు ఎల్బీ స్టేడియంలో వేగంగా జరుగుతున్నాయి. గురువారం మధ్యాహ్నం 1.04 గంటలకు రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయనున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని గవర్నర్‌ను కాంగ్రెస్ నాయకులు కోరనున్నారు.
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోనున్న నేపథ్యంలో ఆయనకు మద్దతుగా సచివాలయ ఉద్యోగులు బయటకొచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తమని బానిసల కంటే హీనంగా చూశారని సచివాలయ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. జూన్ 2న సీఎం కేసీఆర్‌ను, కేటీఆర్‌లను కలవాలని చుస్తే బలవంతంగా తమని సచివాలయంలో రూమ్‌లో పెట్టి తాళాలు వేశారని కన్నీటి పర్యంతమయ్యారు. ఈ మేరకు ఏబీఎన్‌తో తమ గోడును వెళ్లబోసుకున్నారు. యూనియన్లు, అసోసియేషన్ల పేరిట ఇన్ని రోజులు తమ గొంతు నొక్కి ఇబ్బంది పెట్టారని ఉద్యోగులు విలపించారు. ఇక మీదట కాంగ్రెస్ ప్రభుత్వంలో తమ బాధలు తీరతాయని ఉద్యోగులు ఆశాభావం వ్యక్తం చేశారు.









