తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి డిసెంబర్ 7న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సీఎల్పీ భేటీ అనంతరం.. కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డిని సీఎంగా ప్రకటించింది. సమిష్టి నిర్ణయాలతో ముందుకు వెళ్తారని.. డిసెంబర్ 7న ప్రమాణం చేస్తారని ఎఐసీసీ నేత కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. కాగా.. తనను సీఎల్పీ నేతగా ఎంపిక చేయడం పట్ల ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేశారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ అగ్రనేతలైన ఖర్గే, సోనియా, రాహుల్, ప్రియాంకకు కృతజ్ఞతలు తెలిపారు. తనకు అండగా నిలిచిన కాంగ్రెస్ సైనికులకు రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
అంతేకాకుండా తుఫాన్ పరిణామాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలంటూ రేవంత్ రెడ్డి మరో ట్వీట్ చేశారు. సీఎల్పీ నేతగా ఎన్నికైనట్టు ప్రకటన రాకముందే ఈ ట్వీట్ చేశారు. తెలంగాణలో పలు జిల్లాలలో తుఫాను ప్రభావంపై ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. వరి ధాన్యం తడిచిపోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని.. ఏజెన్సీ, లోతట్టు ప్రాంతాల్లో జన జీవనానికి ఇబ్బంది కలుగకుండా చూడాలని.. అవసరమైన సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలంటూ కోరారు.
రేవంత్ రెడ్డి ట్వీట్..
పార్టీ అధిష్టానం పిలుపుతో ఢిల్లీ వెళ్లిన రేవంత్.. అధిష్టానంతో చర్చలు జరిపి కేబినెట్ కూర్పుపై నిర్ణయం తీసుకోనున్నారు. ఇక ఈ గురువారం రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఈ కార్యక్రమానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను వ్యక్తిగతంగా కలిసి రేవంత్ రెడ్డి ఆహ్వానించనున్నారు.
ఇదిలా ఉంటే సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టగానే.. ముందుగా ఆరు గ్యారెంటీలపైనే సంతకం చేయనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆరు గ్యారెంటీలపై రేవంత్ మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే.. మొదటి సంతకం గ్యారెంటీలపై ఉంటుందని చెప్పారు. ఆయన చెప్పినట్లుగానే.. ఆరుగ్యారెంటీలకు సంబంధించిన ఫైళ్ల పై సంతకం పెడతారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.









