AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కేసీఆర్ కు ఊహించని షాక్.. కామారెడ్డిలో ఓటమి

కామారెడ్డి నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ కు ఊహించని షాక్ తగిలింది. కామారెడ్డి నియోజకవర్గంలో పోటీ చేసిన ఇద్దరు అగ్రనేతలు ఓడిపోయారు. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పై బీజేపీ పార్టీ అభ్యర్థి వెంకట రమణారెడ్డి విజయం సాధించారు. దాదాపు 11వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు కామారెడ్డి బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డి.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్లుగానే ఫలితాలు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. అయితే ఈ ఎన్నికల్లో కొందరు ఊహించని విజయాన్ని, కొందరు ఊహించని పరాజయాన్ని సొంతం చేసుకున్నారు. అయితే ఈ ఎన్నికల్లో ఆల్ టైం రికార్డ్ గెలుపంటే కామారెడ్డి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణా రెడ్డిదే. కారణం.. ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్ సహా ముఖ్యమంత్రి అభ్యర్థి రేవంత్ రెడ్డిని ఓడించి సంచలన విజయం సాధించారు. తెలంగాణ ఎన్నికలు ఒక ఎత్తు అయితే, కామారెడ్డి రాజకీయం ఒకత్తు అన్నట్టుగా మారిపోయింది.

వాస్తవానికి ఈ నియోజకవర్గం నుంచి కేసీఆర్ పోటీకి దిగగానే.. కాంగ్రెస్ చీఫ్, ముఖ్యమంత్రి ఆశావాహుడు రేవంత్ రెడ్డి కూడా నామినేషన్ వేశారు. ఎన్నికల చర్చంతా ఈ ఇద్దరు నేతల చుట్టే తిరిగింది. ఈ ఇద్దరిలో ఎవరు గెలుస్తారనే అంచనాలే వచ్చాయి. అయితే ఆ ఇద్దరినీ ఓడిస్తానంటూ వెంకటరమణారెడ్డి ముందు నుంచి చెప్తున్నప్పటికీ.. బహిరంగ చర్చలో మాత్రం దానికి అంత ప్రాధాన్యత లభించలేదు. కానీ, ఎన్నికల ఫలితాల్లో ఊహించని ట్విస్టుల మధ్య చివరికి వెంకటరమణారెడ్డి విజయం సాధించారు.

లెక్కింపు ప్రారంభంలో తొలుత రేవంత్ రెడ్డి ఆధిక్యంలో కనిపించారు. 12వ రౌండ్ వరకు ఆయనే లీడ్ కనబర్చారు. దీంతో రేవంత్ విజయం ఖాయమనే అనుకున్నారు. కానీ 13వ రౌండ్ నుంచి వెంకటరమణా రెడ్డి అనూహ్యంగా ముందుకు వచ్చారు. ఇక అప్పటి నుంచి అటు కేసీఆర్ ను ఇటు రేవంత్ ను వెనక్కి నెడుతూ చివరి వరకూ విజయం వైపు పయనిస్తూ.. చివరికి విజయం సాధించారు.

ANN TOP 10