AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కేసీఆర్‌ పాలనను బొందపెట్టాలి.. అప్పుడే రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి

కేసీఆర్‌ పాలనను బొందపెడితేనే తెలంగాణ రాష్ట్రానికి విముక్తని, అప్పుడు రాష్ట్రం సర్వతోముఖంగా అభివృద్ధి సాధిస్తుందని టీపీపీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. సోమవారం పరకాలలో ఏర్పాటు చేసిన ఎన్నికల సభలో పాల్గొన్నారు. భారీగా జనం హాజరైన ఈ సభలో రేవంత్‌ రెడ్డి కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. విమర్శనాస్త్రాలను సంధించారు. కాంగ్రెస్‌ పాలనపై కేసీఆర్‌ చేస్తున్న విమర్శలను తిప్పికొట్టారు.

కాంగ్రెస్‌ పాలనపై కేసీఆర్‌ కారుకూతలు కూస్తున్నాడని, ఆయన మతి తప్పి మాట్లాడుతున్నాడో, లేదా మందేసి మట్లాడుతున్నాడో అర్ధం కావడం లేదన్నారు. అధికారంలోకి వస్తే రైతుబందు రద్దవుతుందంటున్న దగుల్పాజీ కేసీఆర్‌.. రైతులకు యేడాదికి రూ.15వేలు ఇస్తుందని కాంగ్రెస్‌ పార్టీ వాగ్దానం చేసిన విషయాన్ని మరిచిపోతున్నారని విమర్శించారు. యువకుల ఆత్మబలిదానాలను చూడలేకనే సోనియాగాంఽధీ తెలంగాణ రాష్ట్రం ఇస్తే.. కేసీఆర్‌, ఆయన కుటుంబం రాష్ట్రం సంపదను దోచుకుంటున్నారని ఆరోపించారు.

దేశంలో సీలింగ్‌ చట్టాన్ని తీసుకువచ్చి నాడు దొరలు, జమీందారుల వద్ద ఉన్న వేలాది ఎకరాల భూమిని లాక్కొని పేదలకు పంచిపెట్టింది ఇందిరమ్మ రాజ్యంలోనే అని రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు. ప్రస్తుతం భూమి లేని నిరుపేదల దగ్గర 25లక్షల ఎకరాల భూములు, దళితుల దగ్గర మరో 12 లక్షల ఎకరాల భూములు దగ్గర ఉండడానికి ఇందిరమ్మ రాజ్యమే కారణమన్నారు.

రాష్ట్రంలో లక్షలాది మంది పేదలకు ఇందిరమ్మ ఇళ్లు, ఇళ్ల స్థలాలకు పట్టాలు ఇచ్చింది కూడా ఇందిరమ్మ రాజ్యంలోనేనని అన్నారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో, ముఖ్యంగా పరకాల నియోజకవర్గంలో అభివృద్ధి జరిగింది ఇందిరాగాంధీ పాలనలోనే అన్నారు. 25మంది ఎస్సీలు ఎంపీలు అయి దేశ పరిపాలనలో భాగస్వాములైంది. ఇందిరమ్మ పాలనవల్లనేనని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో అనేకమంది ఆత్మబలిదానాలు చేసుకుటుండం చూడలేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది సోనియాగాంధేనని అన్నారు. పేదవారు ఈ రోజు కడుపు నిండా తింటున్నది, ఆత్మగౌరవంతో బతుకుతున్నది నాడు ఇందిరా గాంధీ అనుసరించిన సుపరిపాలనా విధానాలవల్లనేని అన్నారు. కాంగ్రెస్‌ పాలనలో ఉన్న స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం ఇప్పుడు కానరావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. హక్కుల కోసం, అన్యాయాలు, అక్రమాలకు వ్యతిరేకంగానూ గొంతెత్తున్నవారిని కేసీఆర్‌ నిర్ధాక్షిణ్యంగా అణిచివేస్తున్నారని రేవంత్‌రెడ్డి విమర్శించారు.

ANN TOP 10