AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

‘కల్వకుంట్ల’ పాలైన తెలంగాణ సంపద.. అవినీతికి పరాకాష్ట కేసీఆర్‌ : రాహుల్‌

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత, రాష్ట్ర సంపద అంతా కల్వకుంట్ల కుటుంబానికి చేరిందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ ఆరోపించారు. కాళేళ్వరం ప్రాజెక్టులో కేసీఆర్‌ రూ. లక్ష కోట్ల అవినీతికి పాల్పడ్డారని స్పష్టం చేశారు. వరంగల్‌ జిల్లా కేంద్రంలో శుక్రవారం రోడ్‌షో, కార్నర్‌ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌, కేంద్రంలో బీజేపీని కూకటివేళ్లతో పెకిలించడమే కాంగ్రెస్‌ లక్ష్యమని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడగానే మొదటి క్యాబినేట్‌ సమావేశంలోనే ఆరు గ్యారెంటీల పై సంతకం పెడతామని హామీ ఇచ్చారు. వరంగల్‌ చౌరస్తా నుంచి పోచమ్మమైదాన్‌ సెంటర్‌ వరకు రాహుల్‌ పాదయాత్ర ఆద్యంతం ఉత్సాహపూరితంగా సాగింది. అనంతరం రాణిరుద్రమ జంక్షన్‌లో ప్రజలనుద్దేశించి ప్రసగించారు.

కాంగ్రెస్‌ రాష్ట్రం ఇచ్చింది తెలంగాణ సస్యశ్యామలం కోసమని…కానీ తెలంగాణ సంపద కల్వకుంట్ల కుటుంబానికి చేరిందని, అవినీతికి పరాకాష్ట కేసీఆర్‌ అని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ అన్నారు. వరంగల్‌ జిల్లా కేంద్రంలో శుక్రవారం కాంగ్రెస్‌ తూర్పు అభ్యర్థి కొండా సురేఖ తరపున రాహుల్‌గాంధీ రోడ్‌ షో నిర్వహించారు. వరంగల్‌ హెడ్‌ పోస్టాఫీసు నుంచి వరంగల్‌ చౌరస్తా, జేపీఎన్‌ రోడ్‌ మీదుగా రాహుల్‌ గాంధీ పాదయాత్రగా పోచమ్మమైదాన్‌ చౌరస్తాకు చేరుకొని, కార్నర్‌ మీటింగ్‌లో ప్రసంగించారు.

తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్‌ కుటుంబ పాలన కొనసాగుతుందని, కాళేళ్వరం ప్రాజెక్టులో కేసీఆర్‌ రూ.లక్ష కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్‌ నుంచి విముక్తి చేస్తామని, రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌, కేంద్రంలో బీజేపీని కూకటివేళ్లతో పెకిలించడమే కాంగ్రెస్‌ లక్ష్యమని అన్నారు. తెలంగాణలో కారు టైర్లను పంక్చర్‌ చేసిన తర్వాత 2024లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని సైతం పంక్చర్‌ చేయడమే ప్రధాన లక్ష్యమని తెలిపారు. బీఆర్‌ఎస్‌, బీజేపీ, ఎంఐఎం మూ డు పార్టీలు ఒకటేనని, బీజేపీ అనేక చోట్ల ఎంఐఎం పా ర్టీతో కలిసి కాంగ్రె్‌సను ఓడించేందుకు జత కడుతున్నారని ఆరోపించారు.

ఆరు గ్యారెంటీలపై తొలి సంతకం…
తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడగానే మొదటి క్యాబినెట్‌ సమావేశంలోనే ఆరు గ్యారెంటీలపై సంతకం పెడతామని రాహుల్‌గాంధీ హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఉచిత కరెంట్‌ను అమలు చేస్తామన్నారు. 200 యూనిట్ల వరకు విద్యుత్‌ బిల్లులు వసూలు చేయకుండా ఉచితంగా అందిస్తామని రాహుల్‌గాంధీ ప్రకటించారు. కాంగ్రెస్‌ సర్కారు వస్తే రూ. 500లకే గ్యాస్‌ సిలిండర్‌ అందిస్తామని, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని, పేద మహిళలకు బ్యాంకు అకౌంట్‌లో రూ.2500లు జమ చేస్తామని, రైతులకు ప్రతి ఏటా రూ. 15వేలు, ప్రతి వ్యవసాయ కార్మికునికి సంవత్సరానికి రూ.12 వేలు అందిస్తామని, గృహ నిర్మాణం కోసం రూ.5 లక్షలు కేటాయిస్తామని హామీ ఇచ్చారు.

ఆకట్టుకున్న రాహుల్‌ రోడ్‌ షో
కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ పర్యటనతో వరంగల్‌ కాంగ్రెస్‌ శ్రేణులలో జోష్‌ పెరిగింది. నర్సంపేట నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో రాహుల్‌గాంధీ బయలుదేరి మధ్యాహ్నాం 3:20 నిమిషాలకు మామునూరు ఎయిర్‌పోర్టు చేరుకున్నారు. అక్కడి నుంచి వరంగల్‌ చౌరస్తా చేరుకున్న రాహుల్‌గాంధీ కారులో కొద్దిదూరం ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. అనంతరం కారు దిగి, కొండా సురేఖ, కొండా మురళీధర్‌రావు, పార్టి పరిశీలకులు, నాయకులతో కలిసి పాదయాత్ర ఆరంభించారు. దారిలో ఓ జ్యూస్‌ పాయింట్‌లోకి వెళ్లి సరదాగా జ్యూస్‌ తాగారు. వరంగల్‌ చౌరస్తా నుంచి మొదలైన పాదయాత్ర జెపిఎన్‌ రోడ్డు, మండిబజార్‌ మీదుగా పోచమ్మమైదాన్‌ సెంటర్‌కు సాయంత్రం 4 గంటలకు చేరుకుంది. పాదయాత్ర 25 నిమిషాల పాటు సాగింది.

ANN TOP 10