AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

తెలంగాణకు ‘అభయ హస్తం’.. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో విడుదల..

– అమ్మాయి పెళ్లికి రూ.లక్ష, తులం బంగారం
– వెనువెంటనే ఉద్యోగాల నోటిఫికేషన్లు
– మొదటి ఏడాదిలోనే 2లక్షల ఉద్యోగాల భర్తీకి చర్యలు
– 18 ఏళ్లు పైబడిన ప్రతి విద్యార్థినికి స్కూటీ
– రేషన్‌ డీలర్లకు రూ. 5 వేల గౌరవ వేతనం
– ప్రజాకర్షక పథకాలతో మేనిఫెస్టో
– విడుదల చేసిన మల్లికార్జున ఖర్గే

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టో విడుదల చేసింది. శుక్రవారం గాంధీ భవన్‌లో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మేనిఫెస్టోను విడుదల చేశారు. బీఆర్‌ఎస్‌ పార్టీకి ధీటుగా మేనిఫెస్టోలో పలు ప్రజాకర్షక పథకాలను పొందుపరిచారు. ఇప్పటికే ఆరు గ్యారంటీలు, బీసీ డిక్లరేషన్, మైనార్టీ డిక్లరేషన్‌ లను కాంగ్రెస్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే.

42 పేజీలతో 62 ప్రధాన హామీలతో ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ తాము అందరికీ లబ్ధి చేకూరేలా పీపుల్స్‌ మేనిఫెస్టో రూపొందించినట్లు చెప్పారు. ఈ మేనిఫెస్టో కాంగ్రెస్‌కు భగవద్గీత, ఖురాన్, బైబిల్‌ అని చెప్పారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాాగానే ప్రతీ హామీని అమలు చేస్తామని అన్నారు. రాష్ట్ర సంపదను పేదలకు పంచేలా మేనిఫెస్టోను రూపొందించినట్లు చెప్పారు.
ఇందిరమ్మ కానుక..
మహిళలను ఆకట్టుకోవడానికి కాంగ్రెస్‌ పార్టీ అనేక హామీలను గుప్పించింది. కర్ణాటక తరహాలో మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చింది. అంతే కాకుండా కల్యాణమస్తు పథకంలో భాగంగా ఆడబిడ్డల వివాహానికి లక్ష రూపాలయ ఆర్థిక సాయంతోపాటు ఇందిరమ్మ కానుకగా తులం బంగారం ఇస్తామని హస్తం పార్టీ మేనిఫెస్టోలో పేర్కొంది.

ఉద్యోగాల జాతరే..
వచ్చే ఏడాది ఫిబ్రవరి 1న గ్రూప్‌–1 నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని కాంగ్రెస్‌ పార్టీ హామీ ఇచ్చింది. ఏప్రిల్‌ ఒకటిన గ్రూప్‌–2 నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని తేదీలతో సహా మేనిఫెస్టోలో పేర్కొనడం గమనార్హం. జూన్‌ 1న గ్రూప్‌–3, గ్రూప్‌–4 నియామకాలకు నోటిఫికేషన్‌ వెల్లడిస్తామని తెలిపింది. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే రెండు విడతల్లో 2 లక్షల ఉద్యోగాలను పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా భర్తీ చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు.

మేనిఫెస్టోలోని ముఖ్యమైన హామీలు
– తెలంగాణ అమరవీరుల కుటుంబ సభ్యులకు రూ.25 వేల పింఛను ఆయా కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం
– ఉద్యమకారులపై కేసులు ఎత్తివేసి 250 గజాల ఇళ్ల స్థలం
– వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్‌
– రైతులకు ఏకకాలంలో రూ.2 లక్షల పంట రుణమాఫీ
– రైతులకు రూ.3 లక్షల వడ్డీ లేని రుణాలు
– రైతు కూలీలకు రూ. 12 వేలు
– అన్ని పంటలకు మద్దతు ధర
– చక్కెర కర్మాగారాలు, పసుపు బోర్డు ఏర్పాటు
– భూమిలేని రైతులకు సైతం రైతు బీమా
– ధరణీ స్థానంలో ‘భూమాత’, లేక భూ భారతి పోర్టల్‌
– వార్షిక జాబ్‌ క్యాలెండర్‌ ద్వారా రూ.2 లక్షల ఉద్యోగాల భర్తీ
– ఆడపిల్లల పెళ్లికి రూ.లక్షతో పాటు 10 గ్రాముల బంగారం.
– కాలేజీకి వెళ్లే విద్యార్థులకు విద్యా భరోసా కింద రూ.5 లక్షలు
– 18 ఏళ్లు పైబడిన ప్రతి విద్యార్థినికి స్కూటీ
– నిరుద్యోగుల కోసం యూత్‌ కమిషన్‌.. రూ. 10 లక్షలు వడ్డీ లేని రుణం
– నిరుద్యోగ యువతకు నెలకు రూ. 4 వేల నిరుద్యోగ భృతి
– దివ్యాంగుల నెలవారీ పెన్షన్‌ రూ. 6 వేలకు పెంపు
– అంగన్వాడీ టీచర్లకు నెలకు రూ. 18 వేల వేతనం
– ఎస్సీ రిజర్వేషన్లు 18 శాతానికి పెంపు
– కొత్తగా మూడు ఎస్టీ, మూడు ఎస్సీ కార్పొరేషన్లు ఏర్పాటు
– ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు రూ. 12 లక్షల ఆర్థిక సాయం
– ఇళ్లులేని ప్రతి కుటుంబానికి ఇంటి స్థలంతో పాటు రూ. 6 లక్షల నిధులు
– మధ్యాహ్న భోజన కార్మికుల వేతనం రూ. 10 వేలకు పెంపు
– 50 ఏళ్లు పైబడిన జానపద కళాకారులకు రూ. 3 వేల పెన్షన్‌
– మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు రూ. 5 లక్షలు
– రేషన్‌ డీలర్లకు రూ. 5 వేల గౌరవ వేతనం
– మరణించిన గల్ఫ్‌ కార్మికుడి కుటుంబానికి రూ. 5 లక్షలు పరిహారం
– ముఖ్యమంత్రి కార్యాలయంలో ప్రతిరోజూ ’ప్రజాదర్భార్‌’ ఏర్పాటు
– ప్రతి మండలానికి మార్కెట్‌ యార్డు
– కాళేశ్వరం ముంపుు రైతులకు ఆర్థిక సాయం
– ప్రతి జిల్లాలో కోతుల సంతాన నియంత్రణ కేంద్రాలు
– ఇబ్బందికర ఫార్మాసిటీల రద్దు.

ANN TOP 10