నగరంలోని ముషీరాబాద్‌లో విషాదం చోటు చేసుకుంది. గంగపుత్ర కాలనీలో ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. తమ చిన్నారికి ఉరి వేసి ఆపై దంపతులు కూడా బలవన్మరణానికి పాల్పడ్డారు. మృతులు కర్నూలు జిల్లా లక్ష్మీపురం వాస్తవ్యులుగా గుర్తించారు. వారసి గుడా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతులు భర్త కొప్పుల సాయి కృష్ణ , భార్య చిత్రకళ , కూతురు తేజస్విని(4)గా తెలుస్తోంది.
వారాసిగూడా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. మృతురాలు చిత్రకళ బిర్లా ప్లానిటోరియంలో ఉద్యోగి. సాయి కృష్ణ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. అయితే కొద్ది రోజుల క్రితం సాయికృష్ణను యాజమాన్యం ఉద్యోగంలో నుంచి తీసివేసింది. దీంతో అప్పటి నుంచి సాయికృష్ణ రాపిడో నడుపుతున్నాడు. తాజాగా భార్య చిత్రకళను కూడా బిర్లా ప్లానిటోరియం యాజమాన్యం ఉద్యోగంలో నుంచి తీసివేసింది. ఈ క్రమంలో ఆర్థిక సమస్యల నేపథ్యంలోని వీరు ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని ముగ్గురు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించనున్నారు. వారాసిగూడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
గోడపై సూసైడ్ నోట్..
ఆత్మహత్యకు ముందు చిత్రకళ గోడపై సూసైడ్ నోట్ రాసింది. ‘‘నా చావుకి బిర్లా సైన్స్ సెంటర్‌లో వర్క్ చేస్తున్న శ్యామ్ కొఠారి, గీత రావులు కారణం. నేను పని చేస్తున్న సమయంలో నాపై తప్పుడు ఆరోపణలు చేసి జాబ్ నుంచి తొలిగించారు. అపాయింట్మెంట్ లెటర్, పే స్లిప్స్ అడిగినా పట్టించుకోలేదు. వాళ్ళు చేస్తున్న ఫ్రాడ్స్‌ను నిలదీసినందుకు నన్ను ఉద్యోగం నుంచి తొలిగించారు. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్‌కు ఎన్నో సార్లు ట్విట్టర్‌లో మొర పెట్టుకున్నా పట్టించుకోలేదు’’ అంటూ మృతురాలు చిత్రకళ సూసైడ్ నోట్‌లో ఆవేదన వ్యక్తం చేసింది.









