ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ తొలిసారి జాతీయ రాజకీయాలను ప్రస్తావించారు. 2024 తర్వాత దేశంలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమే వస్తుందని నిజామాబాద్ అర్బన్ సభలో జోస్యం చెప్పారు. అన్ని ఎంపీ సీట్లను మనమే గెలిచి.. కేంద్రంలో బీఆర్ఎస్ తడాఖా చూపిద్దామన్నారు. రాబోయే రోజులు ప్రాంతీయ పార్టీలవే అంటూ కేసీఆర్ పేర్కొన్నారు. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వమే వస్తుందని, అందరు ఎంపీలను కూడా గెలిపించుకుని కేంద్రంలో తడాఖా చూపిద్దామంటూ కేసీఆర్ వివరించారు.
బోధన్, నిజామాబాద్ అర్బన్, ఎల్లారెడ్డి, మెదక్ ఆశీర్వాద సభల్లో ప్రసంగించిన కేసీఆర్.. అభివృద్ధితో పాటు బీఆర్‌ఎస్ మేనిఫెస్టోను వివరించారు. దేశంలో 157 మెడికల్ కాలేజీలు మంజూరు చేసిన కేంద్రం.. తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ కోసం ఏం చేయని బీజేపీకి ఓటు ఎందుకు వేయాలని కేసీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీలు తెలంగాణకు నష్టం చేశాయే తప్ప లాభం చేయలేదన్నారు.
మెదక్ కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి రోహిత్‌పై సెటైర్ వేశారు గులాబీ బాస్. బీఆర్ఎస్ అభ్యర్థి పద్మా దేవేందర్ రెడ్డికి కాంగ్రెస్ అభ్యర్థికి పోలిక ఉందా అని ప్రశ్నించారు. దిష్టిబొమ్మను తీసుకొచ్చి పద్మ ఎదురుగా పెడితే.. మనం ఓడిపోవాలా అన్నారు కేసీఆర్. ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని.. లేకపోతే ఆ ఓటే కాటేస్తుందంటూ సీఎం కేసీఆర్ హెచ్చరించారు.









