AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కాంగ్రెస్ ఆరు గ్యారంటీలతో కేసీఆర్ వెన్నులో వణుకు

ఆదిలాబాద్: కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలతో సీఎం కేసీఆర్ వెన్నులో వణుకు పుట్టిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఎద్దేవ చేశారు. బుధవారం బోథ్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ…‘‘ఆదివాసీలు , లాంబాడాలు కాంగ్రెస్ పార్టీకు రెండు కళ్లలాంటివారు. తెలంగాణలో 12 అసెంబ్లీ స్థానాల్లో 6 లాంబాడాలకు, 6 ఆదివాసీలకు ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించింది. బలరాం నాయక్ పెద్దమనసుతో ఆదివాసీ బిడ్డకోసం ఇల్లందు సీటు వదులుకున్నారు. పదవి కంటే ప్రజలకు మేలు జరగడం ముఖ్యమని ఆయన తన ఎమ్మెల్యే టికెట్ త్యాగం చేశారు. ఓటు చీలిపోకుండా కూడాల్సిన బాధ్యత మీపై ఉంది. తెలంగాణ వచ్చి పదేళ్లయినా బోథ్‌కు నీళ్లేందుకు రాలేదు? ఇక్కడి ప్రజలకు పోడు భూములకు పట్టాలు ఎందుకివ్వలేదు? తండాలను పంచాయతీలుగా చేశామని చెప్పుకునే కేసీఆర్ ఎన్ని పంచాయతీలకు భవనాలు కట్టించారు? గ్రామసర్పంచులకు వేల కోట్ల బకాయిలు ఇవ్వక ప్రభుత్వం వారిని ఆత్మహత్యలకు ఉసిగొల్పింది. కేసీఆర్ తన మేథస్సును రంగరించి కాళేశ్వరం కట్టానని చెబుతున్నాడు.

కట్టిన మేడిగడ్డ మూడేళ్లలో కుంగిపోయింది… అన్నారం పగిలిపోయింది. బోథ్‌కు నీళ్లు రాకపోవడానికి ఈ దద్దమ్మ సీఎం కేసీఆరే కారణం. ఇక్కడి కుఫ్టీ ప్రాజెక్టు పూర్తి కావాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. బోథ్‌కు డిగ్రీ కాలేజీ రావాలంటే ఈ గడ్డపై కాంగ్రెస్ గెలవాలి. ఒక్కసారి ఈ బోథ్ గడ్డపై కాంగ్రెస్ పార్టీను గెలిపించండి. డిసెంబర్ 31లోపు బోథ్‌ను రెవెన్యూ డివిజన్ చేసే జిమ్మేదారి నాది. కుఫ్టీ ప్రాజెక్టుకు నిధులు మంజూరు చేసి ప్రారంభోత్సవానికి వచ్చే బాధ్యత నాది. ఆదిలాబాద్ నుంచి అచ్చంపేట అడవుల వరకు కాంగ్రెస్ పార్టీను గెలిపించండి. ఆదిలాబాద్‌ను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తాం. తెలంగాణలో దొరలపాలన పోవాలి.. ఇందిరమ్మ రాజ్యం రావాలి.అప్పుడే పేద ప్రజలకు న్యాయం జరుగుతుంది. మాట తప్పని మడమ తిప్పని నాయకురాలు సోనియమ్మ. సోనియమ్మ ప్రకటించిన ఆరు గ్యారెంటీలను తెలంగాణలో అమలు చేసి తీరుతాం’’ అని రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు.

ANN TOP 10