AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

వాయుగుండంగా మారనున్న అల్పపీడనం.. ఆ జిల్లాలకు భారీ వర్షసూచన..!

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందని ఏపీ వాతావరణ శాఖ పేర్కొంది. అల్పపీడనంతో పాటు నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల కొనసాగుతోందని వివరించింది. వీటి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు(Rains) కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ముఖ్యంగా ఏపీ సహా తీర ప్రాంత రాష్ట్రాలైన ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఈ అల్పపీడనం గురువారం నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది.

దీనికి అనువైన వాతావరణం ఉన్నట్లు తెలిపింది. గల్ఫ్ ఆఫ్ థాయ్‌లాండ్‌లో ఏర్పడిన తుఫాన్ తరహా వాతావరణం క్రమంగా పశ్చిమ- వాయవ్య దిశగా కదులుతూ, అండమాన్ దక్షిణ ప్రాంతంలో ప్రవేశించినట్లు ప్రకటించింది. దీని ప్రభావంతో తమిళనాడు మొదలుకుని ఏపీ, ఒడిశా, పశ్చిమ బెంగాల్ దక్షిణ తీర ప్రాంత జిల్లాల వరకూ ఈ నెల 16 నుంచి 20వ తేదీ వరకు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. ఇప్పటికే తమిళనాడు తీర ప్రాంత జిల్లాల్లో రెండు రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి.

సోమవారం అర్ధరాత్రి నాగపట్నంలో అతి భారీ వర్షం కురిసి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. మరో మూడు రోజుల పాటు ఇదే తరహా వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది.

అల్పపీడనం కారణంగా దక్షిణ తెలంగాణ చిరు జల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఇటు ఉత్తర తెలంగాణలో ఆకాశం మేఘావృతమయ్యే అవకాశంఉన్నట్లు పేర్కొన్నారు.

ANN TOP 10