తెలంగాణ ఉద్యమంలో ప్రాణ త్యాగం చేసిన అమరులకు విలువ లేదా.. కేసీఆర్, ఆయన కొడుకు, బిడ్డ, అల్లుడు, బంధువుల ఆస్తులు పెంచడానికే ఉద్యమం చేసి ప్రాణాలు త్యాగాలు చేశారా… అంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. ఖిలావరంగల్ మండలంలోని లక్ష్మీపురంలో వర్ధన్నపేట నియోజక వర్గ విజయభేరి సభ మంగళవారం జరిగింది. పార్టీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ సభకు అధ్యక్షత వహించారు.
ముఖ్యఅతిథి రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ వర్ధన్నపేటలో ప్రజల సొమ్ము దోచుకునే దొంగ ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ను గెలిపిస్తారో.. దొంగలను పట్టుకునే కేఆర్ నాగరాజును గెలిపిస్తారో ప్రజలు నిర్ణయించుకోవాలని కోరారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అరూరి రమేష్ ల్యాండ్ పూలింగ్‌లో రైతుల భూములను గుంజుకుంటుంటే, ప్రశ్నించిన రైతులను పోలీసుల బూట్లతో తన్నించిన ఘనత ఆయనకే దక్కిందని ఆరోపించారు. ల్యాండ్ పూలింగ్ జీవో ఇంకా రద్దు కాలేదని, బీఆర్‌ఎస్ మళ్లీ గెలిస్తే భూములు గుంజుకుంటుందని మండిపడ్డారు. వందలాది మంది బిడ్డల ప్రాణ త్యాగాల పునాదుల ఏర్పడిన తెలంగాణను బీఆర్‌ఎస్ ప్రభుత్వం రాజ్యమేలుతోందని ఆరోపించారు.
బీఆర్‌ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం కడితే కూలి పోయిందని, మేడిగడ్డ బ్యారేజీ ఎట్లుం దో ప్రజలు ఓట్ల కోసం వచ్చే బీఆర్‌ఎస్ నాయకులను నిలదీయాలని రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఇసుక మీద బ్యారేజీ కట్టే సన్నాసి, తెలివితక్కువ దద్దమ్మ కేసీఆర్ అని విమర్శించారు. రూ.లక్ష కోట్లతో కట్టిన బ్యారేజీ కూలి పోయిందంటూ మండిపడ్డారు.
డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టిస్తానని ఇంత వరకు ఎవరికీ ఇవ్వలేదని ఆరోపించారు. గజ్వెల్‌లో వంద ఎకరాల్లో సీఎం కేసీఆర్ గడీ కట్టించుకున్నట్లు పేర్కొన్నారు. ఫాం హౌస్ కట్టుకున్న కేసీఆర్, వేలాది ఎకరాల భూములను ఆక్రమించుకున్నారని ఆరోపించారు. ‘తెలంగాణలో చదువుకున్న యువకులందరికీ ఉద్యోగం ఇస్తానంటివి. ఇచ్చావా..’ అంటూ సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు. కేసీఆర్ మాత్రం తన ఇంట్లో అందరికీ ఉద్యోగాలు ఇచ్చారని విమర్శించారు. గ్రామగ్రామాన ప్రజల్ని కేసీఆర్ తాగుబోతులను తయారు చేశారంటూ ధ్వజమెత్తారు.
రాష్ట్రంలో 12శాతం రిజర్వేషన్లు, కేజీ టూ పీజీ ఉచిత విద్య అమలు ఏమైందంటూ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఉద్యోగులకు కనీసం జీతాలివ్వలేని దుస్థితిలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం పరిపాలన చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే సోనియా గాంధీ నేతృత్వంలో ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రతీ మహిళకు నెలకు రూ.2500 నగదు ఇవ్వడం జరుగుతుందని రేవంత్ పేర్కొన్నారు. అలాగే ప్రతీ ఇంటికి రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇస్తామని వెల్లడించారు. మహిళలకు ఉచితంగా బస్ ప్రయాణం చేయడానికి పాస్ ఇస్తామన్నారు.









