AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

అత్యంత ధనవంతులైన అభ్యర్థులు వీరే..!

పేరుకే ఫామ్‌హౌస్‌లో ఉంటారు. కాని గుంట భూమి కూడా ఉండదు. వందల కోట్ల ఆస్తులకు అధిపతులే. కనీసం సెకండ్‌ హ్యాండ్ కారు కూడా ఉండదు వాళ్లకి. అడుగు బయటపెడితే చుట్టూ మంది మార్బలం. అలాంటివారి చేతిలో కూడా చిల్లిగవ్వ ఉండదు. ఇవన్నీ నిజాలే.. ఎక్కడా ఇసుమంత అబద్ధం లేదు. అయితే ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్‌‌లను చూస్తే నమ్మాల్సిందే..! ఆస్తుల చిట్టాలో ఎవరెవరు, ఏమేం ఉన్నాయని చెప్పారో..? ఎన్నికల బరిలో దిగిన అభ్యర్థుల్లో అత్యంత ధనవంతులు ఎవరో చూద్దాం..

తెలంగాణలో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో అత్యంత ధనవంతుడిగా మాజీ ఎంపీ గడ్డం వివేకానంద్ మొదటి స్థానంలో నిలిచారు. చెన్నూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలోకి దిగుతున్న వివేక్ వెంకటస్వామి రూ.606.66 కోట్ల విలువైన చర, స్థిరాస్తులు ఉన్నట్లుగా ఎన్నికల అఫిడవిట్‌లో పొందుపర్చారు.

వివేక్ దాఖలు చేసిన అఫిడవిట్ ప్రకారం, అతని భార్య పేరుతో రూ. 41.5 కోట్ల విలువైన అప్పులు ఉన్నట్లు పేర్కొన్నారు. వివేక్ వార్షిక ఆదాయం 2019లో రూ. 4.66 కోట్ల నుండి గత ఆర్థిక సంవత్సరంలో రూ. 6.26 కోట్లకు పెరిగింది. అదే సమయంలో అతని భార్య ఆదాయం రూ. 6.09 కోట్ల నుండి రూ. 9.61 కోట్లకు పెరిగింది.

ఇక మూడో స్థానంలో మునుగోడు నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్ది కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి నిలిచారు. రాజగోపాల్ రెడ్డి ఆస్తుల విలువ రూ. 458.37 కోట్లు గా ప్రకటించారు. గతంలో పోటీ చేసిన సమయానికి కంటే ఆయన ఆస్తుల విలువ బాగా పెరిగాయి. మునుగోడు నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పుడు రూ. 314 కోట్ల ఆస్తులను ప్రకటించినప్పటి నుంచి 2018 నుంచి ఆయన నికర విలువ 45 శాతానికి పైగా పెరిగింది.

BRS అభ్యర్థిగా పోటీ చేస్తున్న పైళ్ల శేఖర్ రెడ్డి అత్యంత ధనవంతులైన అభ్యర్థుల జాబితాలో నాలుగోవ స్థానం సంపాదించుకున్నారు. శేఖర్ రెడ్డి తన కుటుంబానికి చెందిన రూ. 227 కోట్ల విలువైన ఆస్తులను రూ. 83 కోట్లకు పైగా అప్పులు కలిగి ఉన్నట్లు ప్రకటించారు.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు కుటుంబ ఆస్తుల విలువ దాదాపు రూ. 59 కోట్లు, ఇందులోనూ హిందూ అవిభక్త కుటుంబంనకు సంబంధించి రూ 25 కోట్ల అప్పులు ఉన్నట్లు ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఇదిలావుంటే తెలంగాణలోని 119 అసెంబ్లీ స్థానాలకు వివిధ పార్టీలకు చెందిన 4,798 మంది అభ్యర్థులు 5,716 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం నవంబర్ 30న పోలింగ్, డిసెంబర్ 3న ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి.

ANN TOP 10