తెలంగాణలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్కసారి కూడా వైస్ షర్మిల మీద స్పందించని కేసీఆర్.. తొలిసారిగా ఆమె గురించి ప్రస్తావించారు. కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. పగ పెంచుకుందని.. డబ్బు కట్టలు తీసుకొస్తుందంటూ సంచలన ఆరోపణలు కూడా చేశారు కేసీఆర్.
కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చటమే లక్ష్యంగా.. రాజన్న రాజ్యాన్ని తీసుకురావటమే ధ్యేయంగా.. తెలంగాణలోని వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల వైఎస్సార్ తెలంగాణ పార్టీ పెట్టారు. రాష్ట్రంలో మూడు వేల కిలో మీటర్లకు పైగా పాదయాత్ర నిర్వహించి.. బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతూ, ఆ పార్టీ ప్రజాప్రతినిధులపై ఘాటుగా అవినీతి ఆరోపణలు చేస్తూ.. వార్తల్లో నిలుస్తూ వచ్చారు. ముఖ్యంగా.. ప్రతిసారి కేసీఆర్ మీద, ఆయన కుటుంబం మీద సంచలన ఆరోపణలు చేయగా.. వాటిపై గులాబీ బాస్ ఏమాత్రం స్పందించలేదు. అయితే.. ఈరోజు తొలిసారిగా వైఎస్ షర్మిల మీద కేసీఆర్ స్పందించారు. కేవలం స్పందనే కాదు.. కీలక ఆరోపణలు కూడా చేశారు.
రెండో విడత ప్రచారంలో భాగంగా.. సోమవారం నర్సంపేటలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు కేసీఆర్. ఎప్పటిలాగే… కాంగ్రెస్ పార్టీపై విరుచుపడిన గులాబీ బాస్.. బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలు, కట్టిన ప్రాజెక్టులు, అభివృద్ధి పనుల గురించి వివరించారు. అయితే.. నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ.. వైఎస్ షర్మిల గురించి ప్రస్తావించారు. “వైఎస్ షర్మిల అనే ఆమె పెద్ద సుదర్శన్ రెడ్డి మీద పగ పెంచుకుందట.. ఆయనను ఓడించేందుకు డబ్బు సంచులు పంపిస్తుందటా.. మరి పెద్ద సుదర్శన్ రెడ్డి గెలవాలా.. వైఎస్ షర్మిల పంపించే డబ్బు సంచులు గెలవాలా..? పరాయి రాష్ట్రం వాళ్లు వచ్చి ఇచ్చే నోట్ల కట్టలు గెలవాలా..?” అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు కేసీఆర్.









