AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

తెలంగాణలో ఘనంగా బతుకమ్మ సంబరాలు షురూ..

తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన పూలపండుగ బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శనివారం తొలిరోజు ‘ఎంగిలిపూల’ ఉత్సవాలు సందడిగా సాగాయి. ఒక్కొక్క పువ్వేసి చందమామా.. ఒక్క జాములాయే చందమామ, చిత్తూ చిత్తులబొమ్మ.. శివుని ముద్దుల గుమ్మ అంటూ తెలంగాణ సంప్రదాయ గీతాలతో అతివలు బతుకమ్మలాడారు. మహిళలతోపాటు యువతులు, బాలికలు సైతం బతుకమ్మ ఆటలకు ఆసక్తి చూపారు. పలు రకాల పూలతో అందంగా బతుకమ్మలను పేర్చారు. అందులో పసుపుతో గౌరీదేవిని ఉంచి ప్రత్యేక పూజలు చేసి బతుకమ్మ చల్లంగా చూడాలంటూ వేడుకున్నారు. మహిళల ఆటపాటలతో ఊరువాడా హోరెత్తాయి. వీధుల్లోని కూడళ్లు, చెరువుగట్లు, దేవాలయాలు బతుకమ్మ ఉత్సవాలతో సందడిగా మారియి. తీరొక్క బతుకమ్మలతో చెరువులు, ఏరుల వద్ద బతుకమ్మ ఘాట్లు, పట్టణ, పల్లె ప్రాంతాలు సప్తవర్ణశోభితంగా మారాయి.

భారీ సంఖ్యలో మహిళలు బతుకమ్మప్రాంగణానికి చేరుకుని ఆటపాటలతో సందడి చేశారు. అనంతరం సమీపంలోని వాగులు, చెరువుల వద్దకు వెళ్లి బతుకమ్మలను నిమజ్ఞనం చేశారు. కొందరు దేవాలయాల్లో బతుకమ్మలను ఉంచారు. మహిళలు తమ వెంట తెచ్చుకున్న పిండి సత్తులను వాయినంగా సమర్పించుకుని ఒకరినొకరు ఆత్మీయతను చాటుకున్నారు.

ANN TOP 10