హనుమకొండ: ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులపై తెలంగాణ మంత్రులు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తోందంటూ మండిపడుతున్నారు. కవితకు నోటీసులపై మంత్రులు సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు మీడియాతో మాట్లాడుతూ.. మహిళా దినోత్సవం రోజే కవిత కు నోటీసులు ఇవ్వడం కేంద్ర ప్రభుత్వం కక్ష పూరిత ధోరణిని తెలియజేస్తోందన్నారు. కేంద్రం విధానాలను ప్రశ్నించిన వారిపై కేసులతో లొంగదీసుకోవాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంపై మరింతగా పోరాడుతామని మంత్రులు స్పష్టం చేశారు.
కేంద్రం వేధింపులకు భయపడేది లేదన్నారు. ఇట్లాంటి చర్యలు బీజేపీ పతనానికి నాందిగా పేర్కొన్నారు. దేశమంతా మహిళా దినోత్సవ వేడుకలు జరుపుకుంటుంటే ఒక మహిళ పట్ల ఈ విధమైన కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం దుర్మార్గపు చర్యని మండిపడ్డారు. మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం కవిత ఢిల్లీలో ఆందోళనకు సిద్ధమైతే బీజేపీకి వెన్నులో వణుకుపుట్టిందని… అందుకే ఇలాంటి కుట్రలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఈడీ బోడిలను అడ్డుపెట్టుకుని ఎన్ని వేషాలు వేసినా భయపడమని మంత్రులు ఎర్రబెల్లి, రాథోడ్ తేల్చిచెప్పారు.