మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు బీజేపీ ఎంపీ బండి సంజయ్. నిజామాబాద్ సభలో ప్రధాని మోదీ చెప్పింది తప్పని నిరూపించగలరా? ఎన్డీయేలో చేరతానని, కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేస్తానని అనలేదని, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మోదీ మద్దతు అడగలేదని తడిబట్టలతో భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం ముందు ప్రమాణం చేస్తారా? అని సీఎం కేసీఆర్ కు సవాల్ విసిరారు బండి సంజయ్. అలా అని కేసీఆర్ ప్రమాణం చేస్తే.. మోదీ అబద్దం చెప్పారని మేమంతా ఒప్పుకుంటామన్నారు బండి సంజయ్.
‘ఖబడ్డార్ ట్విట్టర్ టిల్లు. ప్రధానిని పట్టుకుని నీచంగా మాట్లాడతావా? సీఎం పదవి కోసం కేసీఆర్ నే గోసలు పెడుతున్న వ్యక్తిని నీవు. మీది ఫక్తు మోసకారి కుటుంబం. మంత్రి పదవి కోసం నీ పేరునే తారక రామారావుగా మార్చిన చీటర్ మీ అయ్య. హద్దు మీరితే ప్రజలే మిమ్మల్ని తరిమికొడతారు. ఎన్డీఏ 38 పార్టీల కూటమి. బీఆర్ఎస్ పార్టీది ఏ కూటమి. నిన్ను ఎవడూ నమ్మడు. మోసగాళ్ల పార్టీ మీది.
దుబాయ్ చంద్రశేఖర్ రావు నుండి నేటి అజయ్ రావు వరకు అంతా మోసమే. అసలు తెర వెనుక ఏం జరిగిందో ఒక్కసారి వెళ్లి మీ అయ్యను అడుగు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు, బీజేపీకి 5వేల ఓట్లే తేడా. ఆ తర్వాత మీ అయ్య పోయి ఏం చేసిండో అడుగు. దుబ్బాక ఎన్నికల్లో, హుజూరాబాద్, జీహెచ్ఎంసీ, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పెద్దఎత్తున డబ్బులు పంచి ఏం సాధించారు? మునుగోడులో వందల కోట్లు ఖర్చు చేసి ఏం సాధించారు? మహా అంటే బోటా బోటీ మెజారిటీతో గెలిచారంతే.
మోదీ ఇప్పుడే ఎందుకు బయటపెట్టారనుకుంటున్నావా? శిశుపాలుడి లెక్క మీరు నూరు తప్పులు చేశారు. మీ పాపాలు పండాయి. కాబట్టే బయటపెట్టారు. మీ కుటుంబమే పెద్ద మోసకారి కుటుంబం. దోచుకోవడమే మీ పని. తెలంగాణ అంటే మీ నలుగురే. నెంబర్ వన్ చీటర్స్ కుటుంబం. మోదీని చీటర్ అంటావా? మీ అయ్య నెంబర్ వన్ చీటర్. దొంగ దీక్ష చేసి మీడియా ఎదుట నటించాడు. మీ అయ్య సీఎం అయ్యాడంటే.. అది బీజేపీ పెట్టిన భిక్ష అని బండి సంజయ్ కేటీఆర్‌పై మండిపడ్డారు.









