AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రెండ్రోజుల్లో కూతురు పెళ్లి.. లండన్‌లో హైదరాబాద్‌వాసి దారుణ హత్య

లండన్‌లో హైదరాబాద్ వాసి దారుణ హత్యకు గురయ్యాడు. ఇద్దరు దుండగులు కత్తులతో హతమార్చి దారుణంగా చంపేశారు. రెండ్రోజుల్లో కూతురు పెళ్లి ఉండగా.. ఇంతలోనే అతడు హత్యకు గురి కావటంతో హైదరాబాద్‌లోని నివాసంలో విషాదం అలుముకుంది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌కు చెందిన మహమ్మద్‌ ఖాజా రయిసుద్దీన్‌(65) ఉపాధి నిమిత్తం 2011లో లండన్ వెళ్లాడు. యూకేలోని వెస్ట్‌ యార్క్‌షైర్‌లో నివాసం ఉంటున్నాడు.

అయితే సెప్టెంబర్ 30న రాత్రి (భారత కాలమానం ప్రకారం) ఆఫ్ఘానిస్తాన్‌కు చెందిన తన మిత్రుడితో కలిసి వెళ్తుండగా..ఉగాండాకు చెందిన ఇద్దరు వ్యక్తులు వీరిపై దాడి చేశారు. కత్తులతో విచక్షణారహితంగా పొడిచి హత్య చేశారు. అనంతరం వారి వద్ద ఉన్న సొమ్ముతో ఉడాయించారు. ఘటనలో రయిసుద్దీన్‌తో పాటు అతని స్నేహితుడు (55) కూడా ప్రాణాలు కోల్పోయాడు.

2011 నుంచి లండన్‌లో ఉంటున్న రయిసుద్దీన్‌కు భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. అతని కుమార్తె వివాహం అక్టోబర్ 5న జరగాల్సి ఉంది. కూతురు పెళ్లి పనులు ఇంటి వద్ద జరుగుతుండగా.. స్వదేశానికి బయల్దేరేందుకు సిద్ధమయ్యాడు. ఇంతలోనే దారుణ హత్యకు గురై ప్రాణాలు కోల్పోవటంతో అతడి ఇంటి వద్ద విషాదం అలుముకుంది. మరోవైపు రసయిద్దీన్ మృతదేహాన్ని ఇండియాకు రప్పించేందుకు మృతుడు కుటుంబసభ్యులు ప్రయత్నిస్తున్నారు. ఆ కుటుంబానికి సాయం అందించాలని.. ఎంబీటీ నేత అంజదుల్లా విదేశాంగ శాఖ మంత్రి సుబ్రమణ్యం జై శంకర్‌ను అభ్యర్థించారు.

ANN TOP 10