నోబెల్ బహుమతుల ప్రకటనలు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు స్వీడన్‌లోని స్టాక్‌హోంలో ఉన్న కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్‌లోని నోబెల్ జ్యూరీ సోమవారం ప్రకటించింది. మొదట వైద్య శాస్త్రంలో నోబెల్ బహుమతి సాధించిన వారి పేర్లను వెల్లడించారు. ప్రపంచాన్ని గజగజలాడించిన కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు సమర్థవంతమైన ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ల అభివృద్ధిలో కీలక పరిశోధనలు చేసిన వారిని ఈ ఏడాదికి నోబెల్ బహుమతి లభించింది.
వైద్య శాస్త్రంలో విశేష కృషి చేసిన కాటలిన్ కరికో, డ్రూ వెయిస్‌మన్‌కు అత్యంత ప్రతిష్ఠాత్మక నోబెల్ పురస్కారం 2023 వరించింది. కొవిడ్‌ను కట్టడి చేసేందుకు వ్యాక్సిన్ల అభివృద్ధిలో న్యూక్లియోసైడ్ బేస్ మాడిఫికేషన్లకు సంబంధించిన ఆవిష్కరణలకు గానూ వీరిద్దరికీ ఈ అవార్డును ప్రకటించినట్లు జ్యూరీ మెంబర్లు చెప్పారు. ఈ మేరకు స్వీడన్‌లోని స్టాక్‌హోంలో ఉన్న కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్‌లోని నోబెల్ బృందం సోమవారం కాటలిన్ కరికో, డ్రూ వెయిస్‌మన్ పేర్లను ప్రకటించింది. మానవ పరిణామ క్రమంతో పాటు అంతరించిపోయిన హోమినిన్ జన్యువులకు సంబంధించిన ఆవిష్కరణలు చేసినందుకుగానూ స్వాంటె పాబో వైద్య శాస్త్రంలో గతేడాది ఈ నోబెల్ బహుమతిని అందుకున్నారు.
ఈ 2023 నోబెల్ బహుమతులకు ఎంపికైన వారి పేర్లను రోజుకో రంగం చొప్పున వారం రోజుల పాటు వెల్లడించనున్నారు. వైద్య విభాగంతో మొదలైన నోబెల్ పురస్కారాల ప్రదానం.. మంగళవారం ఫిజిక్స్, బుధవారం కెమిస్ట్రీ, గురువారం సాహిత్య విభాగాల్లో ఎంపికైన వారి పేర్లను ప్రకటిస్తారు. శుక్రవారం 2023 నోబెల్ శాంతి బహుమతి, అక్టోబర్ 9 న ఎకనమిక్స్‌లో ఈ నోబెల్ పురస్కారాన్ని దక్కించుకున్న వారి పేర్లను విడుదల చేయనున్నారు. అయితే నోబెల్ పురస్కారం దక్కించుకున్న వారికి అందించే నగదు బహుమతిని ఈ ఏడాది పెంచారు.









