లోక్సభ, రాష్ట్రాల శాసనసభల్లో మహిళలకు ప్రాతినిధ్యం పెంచేలా.. వారికి 33 శాతం సీట్లు కేటాయించేందుకు ఉద్దేశించిన మహిళా రిజర్వేషన్ బిల్లుకు పార్లమెంటు ఉభయసభలు ఆమోద ముద్ర వేశాయి. ఇప్పటికే ఈ బిల్లు లోక్సభలో ఆమోదం పొందగా.. గురువారం రాజ్యసభలో కూడా ఆమోదం లభించింది. ఓటింగ్ సమయంలో పెద్దల సభలో ఉన్న సభ్యులందరూ ఏకగ్రీవంగా బిల్లుకు మద్దతు తెలపడంతో సులువుగా ఆమోదం పొందింది. సుదీర్ఘ చర్చ తర్వాత ఈ ఓటింగ్ నిర్వహించారు.
చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన మహిళా రిజర్వేషన్ బిల్లును రాజ్యసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. నారీ శక్తి వందన్ అధినియమ్ పేరుతో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ చరిత్రాత్మక బిల్లును గురువారం రాజ్యసభలో ప్రవేశపెట్టగా.. సుదీర్ఘంగా చర్చ జరిపారు. చివరికి ఓటింగ్ నిర్వహించగా.. సభలోని సభ్యులు అందరూ మద్దతుగా ఓటు వేశారు. ఎలక్ట్రానిక్ పద్ధతిలో నిర్వహించిన ఈ ఓటింగ్ ప్రక్రియలో ఈ బిల్లుకు అనుకూలంగా సభలో ఉన్న 215 మంది మద్దతు తెలిపారు. ఇక పార్లమెంటు ఉభయ సభలు ఈ బిల్లుకు ఆమోద ముద్ర వేయగా.. ఇక చివరి అంకం మాత్రమే మిగిలి ఉంది. ఈ బిల్లును రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూ వద్దకు పంపించనున్నారు. రాష్ట్రపతి సంతకంతో ఈ మహిళా రిజర్వేషన్ల బిల్లు కాస్త మహిళా రిజర్వేషన్ల చట్టంగా మారనుంది.