నటనే ఆయన శ్వాస, ధ్యాస.. తెలుగు సినీ కళామతల్లి ఒడిలో ఆయనో అలుపెరగని బాటసారి… ఆయన నటనను వివరించడానికి అక్షరాలు చాలవు. సినీ రంగంలో సామాన్య స్థాయి నుంచి అసామాన్య స్థాయికి ఎదిగిన నట దిగ్గజం. ఎన్నో సాంఘిక, జానపద, పౌరాణిక, చారిత్రక చిత్రాల్లో అద్భుతంగా నటించి నటనకే భాష్యం చెప్పిన నటసామ్రాట్… ఆయనే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, పద్మవిభూషణ్ అక్కినేని నాగేశ్వరరావు. నేడు శత జయంతి సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోలో ఆయన విగ్రహావిష్కరణ కార్యక్రమం సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.
ఏఎన్ఆర్…ఈ మూడక్షరాలు తెలుగు సినీ జగతిలో మరిచిపోలేని మైలురాళ్లు… ఆయన ఖాతాలో ఎన్నో అద్భుత చిత్రాలు…ఇంకెన్నో మరిచిపోలేని పాత్రలు…మరెన్నో ఆణిముత్యాల్లాంటి పాటలను తెలుగు తెరకు పరిచయం చేసిన ఘనత అక్కినేనిది. ఒక్కమాటలో చెప్పాలంటే తెలుగు సినీ లోకంలో విరిసిన కమలం నాగేశ్వరరావు. తెలుగు చిత్ర పరిశ్రమలో మొట్టమొదటి కమర్షియల్ హీరో స్టేటస్ దక్కించుకున్న ఘనత అక్కినేనిది. అక్కినేని నాగేశ్వరరావు విగ్రహాన్ని అన్నపూర్ణ స్టూడియోలో భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆవిష్కరించారు. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి మహేష్ బాబు, రామ్ చరణ్, నాని వంటి హీరోలు, మరోవైపు సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు.









