AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఇంటింటికీ అభయ ‘హస్తం’

అభయ హస్తం పేరుతో ఆ ఆరు గ్యారెంటీలను కార్డుపై సవివరంగా ముద్రించిన టీపీసీసీ.. వాటిని ఇంటింటికీ పంపిణీ చేసే కార్యక్రమాన్ని చేపట్టింది. సీడబ్ల్యూసీ సమావేశంలో పాల్గొనేందుకు హైదరాబాద్‌ వచ్చిన పార్టీ జాతీయ నేతలు ఒక్కొక్కరు ఒక్కో నియోజకవర్గానికి వెళ్లి దీన్ని ప్రారంభించారు. సుమారు వంద మంది జాతీయ నేతలు రాష్ట్రవ్యాప్తంగా వివిధ నియోజకవర్గాల్లో ప్రారంభించినట్లు కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి. ఇకపై స్థానిక పార్టీ నేతలు ఇంటింటికీ వెళ్లి కాంగ్రెస్‌ గ్యారెంటీ కార్డును పంచుతూ..

పార్టీ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఆరు గ్యారెంటీలనూ అమలు చేస్తామని చెప్పడంతో పాటు కార్డు అందినట్లుగా రసీదులూ తీసుకోనున్నారని వెల్లడించాయి.విజయభేరి సభలో ప్రకటించిన కాంగ్రెస్‌ గ్యారెంటీలకు క్షేత్రస్థాయిలో అనూహ్య స్పందన కనిపిస్తోందని కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి. వినాయక చవితి రోజున పార్టీ జాతీయ నేతలు రాష్ట్రంలోని దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ఒకేసారి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రకటించిన ఆరు గ్యారెంటీలు రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ లబ్ధి చేకూర్చేలా ఉండడంతో క్షేత్రస్థాయిలో అనూహ్య స్పందన వచ్చిందని నేతలు చెబుతున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇది బాగా కనిపించిందంటున్నారు. రైతులతో పాటు కౌలు రైతులకూ ఎకరాకు రూ.15 వేల చొప్పున పెట్టుబడి సాయం, వ్యవసాయ కార్మికునికి రూ.12 వేలు గ్యారెంటీ అనేది రైతాంగం మొత్తాన్ని ఆకర్షించేలా ఉందని అంటున్నారు. పేద మహిళలకు రూ.2500, రూ.500కే సిలెండర్‌ గ్యారెంటీ అనేవి సగటు మహిళ అవసరాలన్నింటినీ తీర్చేలా ఉన్నాయంటూ మహిళల నుంచి పార్టీ నేతలకు కితాబులూ వచ్చాయి.

సూర్యాపేటలో రఘువీరారెడ్డి, సంగారెడ్డిలో సీడబ్ల్యూసీ సభ్యుడు గురుదాస్‌ సింగ్‌, మధిరలో సీఎల్పీ నేత భట్టివిక్రమార్క, మంచిర్యాలలో త్రిపుర సీఎల్పీ నేత సుదీ్‌పరాయ్‌, ఫరూక్‌నగర్‌లో మణిపూర్‌ మాజీ సీఎం ఒక్రమ్‌ ఇబోబిసింగ్‌.. ఇలా దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ పార్టీ జాతీయ నేతలు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎన్నికలకు కొద్ది నెలలే ఉన్నందున గ్యారెంటీ కార్డును ప్రతి ఇంటికీ చేర్చే కార్యక్రమాన్ని ఉధృతం చేయనున్నట్లు పార్టీవర్గాలు తెలిపాయి.

ANN TOP 10